ఈక్వెడార్ భూకంపం: 235కు చేరిన మృతుల సంఖ్య
ఈక్వెడార్ రాజధాని క్వీటోను కుదిపేసిన భారీ భూకంపం
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదు
తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికల జారీ
క్వీటో: ఈక్వెడార్ రాజధాని క్వీటోను భారీ భూకంపం కుదిపేయగా మృతుల సంఖ్య గంటగంటకూ పెరిగిపోతోంది. భూకంప ధాటికి మృతిచెందిన వారి సంఖ్య 235 కి పెరిగినట్టు ఆ దేశ అధికారులు ఆదివారం రాత్రి వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ దేశ ఉపాధ్యక్షుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్టు జార్జ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాజధాని క్వీటోలో భూప్రకంపనల తీవ్రత బలంగా ఉండటంతో అక్కడి ప్రాంతీయ తీరప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
కాగా, స్థానిక కాలమానం ప్రకారం శనివారం 11.58 గంటల ప్రాంతంలో భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో బలమైన భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైనట్టు అమెరికా జీయోలాజికల్ సర్వే వెల్లడించింది. క్వీటోకు పశ్చిమ-వాయువ్యంగా 173 కిలోమీటర్ల దూరంలో, మరో చోట ఆగ్నేయ దిశగా మూస్నేకు 28 కిలోమీటర్ల దూరంలో భూప్రకపంనలు చోటుచేసుకున్నాయి. 11 నిమిషాల కాల వ్యవధిలో ఒకే ప్రాంతంలో రెండు భూకంపాలు కుదిపేసినట్టు యూస్‌జీయస్ వెల్లడించింది. తొలుత 4.8 గా ఉన్న భూకంప తీవ్రత, ఆ తర్వాత 7.8 తీవ్రత నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.