ఈక్వెడార్ అధ్యక్షుడు డేనియల్ నోబోవా తాజాగా క్రిమినల్ గ్రూప్ ‘ఈక్వెడార్ గ్యాంగ్‌స్టర్స్ స్టార్మ్ స్టూడియో’పై సైనిక చర్యకు ఆదేశించారు. హుడ్ ధరించిన ఈ గ్రూప్‌నకు చెందిన ముష్కరులు టెలివిజన్ స్టూడియోపై దాడి చేయడంతో పాటు భద్రతా బలగాలను, పౌరులను చంపుతామని బెదిరించడంతో అధ్యక్షుడు ఇటువంటి ఆదేశాలు జారీచేశారు.
ఈక్వెడార్‌లో పేరుమోసిన నేరస్తుడు జోస్ అడాల్ఫో ఇటీవల మాసియాస్ జైలు నుండి తప్పించుకోవడంతో దేశంలో భద్రతా సంక్షోభం తలెత్తింది. దేశంపై గ్యాంగ్‌స్టర్లు యుద్ధం ప్రకటించారు. దీంతో దేశం అంతర్గత సాయుధ సంఘర్షణలో ఉందని అధ్యక్షుడు నోబోవా ప్రకటించారు. శాంతియుత స్వర్గధామంగా ఉన్న ఈక్వెడార్‌పై పట్టుసాధించేందుకు ఇటీవలి కాలంలో మెక్సికన్,కొలంబియన్ కార్టెల్స్‌తో సంబంధం కలిగిన ప్రత్యర్థి ముఠాలు పోటీ పడుతున్నాయి.
తాజాగా ఈ క్రిమినల్ గ్రూపులను మట్టుబెట్టేందుకు సైనిక చర్య చేపట్టాలని దేశ సాయుధ బలగాలను అధ్యక్షుడు నోబోవా ఆదేశించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. పోర్ట్‌సిటీలోని టీసీ టెలివిజన్ స్టూడియోలో తుపాకులు, గ్రెనేడ్‌లతో దుండగులు దాడికి పాల్పడిన దరమిలా అధ్యక్షుడు ఈ ప్రకటన చేశారు.
కాగా స్టూడియోలో తుపాకీ కాల్పుల మధ్య ఒక మహిళ.. ‘షూట్ చేయవద్దు, దయచేసి కాల్చకండి’ అని వేడుకుంది. అయితే ముష్కరులు వార్తలు చదువుతున్న వ్యక్తితో పాటు అక్కడున్న ఇతర ఉద్యోగులను నేలపై కూర్చోమని ఆదేశించి, తలపై తుపాకీ ఎక్కుపెట్టారు. తమ వద్ద బాంబులు ఉన్నాయని బెదిరించారు. ఈ ఉదంతమంతా టీవీ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారమైంది. లైవ్‌లో తుపాకీ శబ్దాలూ వినిపించాయి. దీనిని ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షించారు. సుమారు 30 నిమిషాల గందరగోళం తర్వాత అధికారులు స్టూడియోలోకి ప్రవేశించడం కనిపించింది.
దీనికి ముందు గ్యాంగ్‌స్టర్లు పోలీసు అధికారులను కిడ్నాప్ చేశారు. అధ్యక్షుడు నోబోవా ప్రకటించిన 60 రోజుల అత్యవసర పరిస్థితి, రాత్రిపూట కర్ఫ్యూకి నిరసనగా గ్యాంగ్‌స్టర్లు దేశంలోని పలు నగరాల్లో పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారు. కాగా 36 ఏళ్ల నోబోవా దేశంలో మాదకద్రవ్యాల సంబంధిత నేరాలు, హింసకు వ్యతిరేకంగా పోరాడతానని డేనియల్ నోబోవా ప్రతిజ్ఞ చేసిన దరిమిలా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment