సాక్షి,దేవరాపల్లి(అనకాపల్లి): సినీ పరిశ్రమలో కార్మికుడిగా చేరిన కళామతల్లి ఆశీస్సులతో అంచెలంచెలుగా ఎదిగి నేడు సినిమా స్టూడియో యజమాని స్థాయికి చేరుకోగలిగారు... అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలానికి చెందిన కొల్లి రామకృష్ణ. 1978లో చెన్నైలో సినీ రంగ కార్మికుడిగా చేరి, వివిధ భాషల్లో తీసిన 1600 సినిమాలకు విజయ వాహిని స్టూడియో తరపున సౌండ్ ఇంజినీర్‌గా పని చేశారు.
1997లో తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు రావడంతో ఇక్కడి శబ్ధాలయ స్టూడియోలో చేరి 2001 వరకు పని చేశారు. 2002లో రిథమ్ డిజిటల్ సినీ స్టూడియోను తానే సొంతంగా నిర్మించుకున్నారు. 2014 నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా, ఉపాధ్యక్షుడిగా పని చేసి గత నెల(ఏప్రిల్) 27న అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు కావడం ఎంతో సంతోషాన్నిచ్చింది...
ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఫిల్మ్ ఛాంబర్‌లో సినీ రంగంలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు, సినీ స్టూడియో యజమానులు సభ్యులుగా ఉంటారు. దాసరి నారాయణరావు, రామానాయుడు, రాజేంద్రప్రసాద్ తదితర సినీరంగ ప్రముఖులు అధ్యక్షుడిగా పని చేసిన ఫిల్మ్‌చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థకు తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని రామకృష్ణ తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన తన స్వగ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. తాను సినీరంగంలో అంచెలంచెలుగా ఎదిగిన క్రమాన్ని, విశేషాలను వివరించారు. సినిమా షూటింగ్‌లకు ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విశాఖనగరం ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలిపారు.
సినీ రంగానికి ఏపీ ఎంతో అనుకూలం
ఆంధ్రప్రదేశ్‌లో సినిమాలు తీసేందుకు అనువైన అహ్లాదకర ప్రాంతాలు, అందమైన లొకేషన్లు అనేకం ఉన్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ సినీ రంగం మరింత అభివృద్ధి చెందే విధంగా త్వరలోనే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డిని ఫిల్మ్ ఛాంబర్ కార్యవర్గం కలిసి కోరతాం. ఈనెల ఆఖరి బుధవారం మా సంస్థ కార్యవర్గం సమావేశమై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటాం. మా సంస్థకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో దీనికి అనుబంధ సంస్థలు ఉన్నాయి. వీటిని త్వరలో సందర్శిస్తాం.
–కొల్లి రామకృష్ణ, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment