వరద బాధితుల కోసం ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..సురేష్ బాబు, దిల్‌ రాజు భారీ విరాళం | Telugu Film Chamber And Dil Raju Donate Two States Floods | Sakshi
Sakshi News home page

వరద బాధితుల కోసం ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..సురేష్ బాబు, దిల్‌ రాజు భారీ విరాళం

Published Thu, Sep 5 2024 8:06 PM | Last Updated on Thu, Sep 5 2024 8:20 PM

Telugu Film Chamber And Dil Raju Donate Two States Floods

తెలుగు రాష్ట్రాల్లో వరద వల్ల నష్టపోయిన బాధితులకు సాయం చేసేందకు తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితులపే ఆదుకునేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తాజాగా ప్రకటించింది. నివేదిక సాయంతో బాధితుల కోసం సహాయ కార్యక్రమాలను చేపడుతామని ఫిల్మ్ ఛాంబర్ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని సినిమా థియేటర్‌ల వద్ద విరాళాలు, ఆహార వస్తువలను సేకరించేందుకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చాలామంది సినీ ప్రముఖులు విరాళాలు అందించారు. తాజాగా ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షలు విరాళం ప్రకటించింది.  తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరపున ఏపీకి 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు అందిస్తుండగా  ఫెడరేషన్ తరపున రెండు రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. దగ్గుబాటి కుటుంబం తరఫున ఇరు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు నిర్మాత సురేశ్‌ బాబు ప్రకటించారు. అనంతరం దిల్‌ రాజు కూడా తెలంగాణకు రూ. 25 లక్షలు, ఏపీకి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చిన వరదల వల్ల చాలామంది నిరాశ్రయులయ్యారు. దీంతో బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినీ పరిశ్రమ చేయబోతున్న యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు.

ఈ సందర్భంగా ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'విజయవాడ, ఖమ్మంలో వరదలు రావడం వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు.  ఇలాంటి విపత్తులు ఎప్పుడు వచ్చినా సాయం చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలాగే ఈసారి కూడా ఎలాంటి సహాయసహకారాలు చేస్తే బాగుంటుంది అనేదానిపై చర్చించాము. ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీ, తెలంగాణకు విరాళంగా ప్రకటిస్తున్నాం. రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు సంబంధించి అకౌంట్ నంబర్స్ అలాగే, ఛాంబర్ నుంచి ఒక అకౌంట్ నంబర్ ఇస్తున్నాం. సహాయం చేయాలనుకునేవారు  ఈ అకౌంట్స్‌కు డబ్బులు పంపించవచ్చు.' అని తెలిపారు.

నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ.. 'ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మన పరిశ్రమ ఆదుకునే విషయంలో ముందుంటుంది. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమ అండగా ఉంటుంది. డబ్బు రూపంలోనే కాకుండా నిత్యావసరాలను కూడా అందించే ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.' అని చెప్పారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'తెలుగు రాష్ట్రాల్లో వరదల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలామంది హీరోలు విరాళాలు అందించారు. అలాగే చాంబర్ నుంచి కూడా సహాయం చేయాలని నిర్ణయించాం. ఫెడరేషన్ పిలుపుమేరకు ఇండస్ట్రీలోని అందరూ ముందుకు వచ్చి   విరాళాలు అందించాలని కోరుతున్నాం. తద్వారా వచ్చిన విరాళాలను ప్రభుత్వాలకు అందిస్తాం.' అని చెప్పారు.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ..'మేము ఈ స్థాయికి రావడానికి కారణం ప్రజల ఆదరణే. ఇప్పుడు వాళ్లు కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం వాళ్లను ఆదుకోవాలి. అలాగే మాకు ఎప్పుడూ అండగా ఉండే ప్రభుత్వాలకు మద్దతును తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. అని చెప్పారు.

ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ..'రేపు అన్ని యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఒకరోజు వేతనం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. మా కార్మికుల తరపున తెలుగు రాష్ట్రాలకు ఎంత చేయాలో అంతా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం.' అని చెప్పారు.

నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..'వరద బాధితులను ఆదుకోవడం కోసం ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేశాం. తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేం ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని కమిటీ వాటిని తీర్చేలా ముందుకు వెళ్తుంది.' అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement