జిల్లాలో సినీ, టీవీ స్టూడియో నిర్మిస్తా
జిల్లాలో సినీ, టీవీ స్టూడియో నిర్మిస్తా
Published Wed, Apr 26 2017 10:59 PM | Last Updated on Fri, Aug 17 2018 2:27 PM
–హాస్య నటుడు గౌతంరాజు
రాయవరం(మండపేట): ‘గోదావరి జిల్లాలో పుట్టినందుకు ఎంతో సంతోషిస్తున్నా. జిల్లావాసిగా కళామతల్లి రుణం తీర్చుకునేందుకు తగిన కృషి చేస్తున్నా’నన్నారు ప్రముఖ హాస్యనటుడు గౌతంరాజు. ఆత్మీయత, అనుబంధానికి జిల్లా పెట్టింది పేరని, మరో జన్మంటూ ఉంటే ఈ జిల్లాలోనే పుట్టాలని ఉందని చెప్పారు. రాయవరం సాయితేజా 20వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
పాఠశాల దశ నుంచే నాటకాలు
రాజోలులో పుట్టిన నేను కాకినాడ కాకినాడ పీఆర్ కళాశాలలో బీఎస్సీ చదివాను. విద్యాభ్యాసం అనంతరం హైదరాబాద్‌లోని ఇంటర్మీడియేట్ బోర్డులో ఉద్యోగం చేశాను. సినిమారంగంపై ఉన్న ఆసక్తితో దీర్ఘకాలిక సెలవులో వెళ్లి, 1991లో ఉద్యోగానికి రాజీనామా చేశాను. పాఠశాల దశ నుంచి నాటకాలు వేశాను. కాకినాడలో చదువుతుండగా 42 ప్రదర్శనలు ఇచ్చాను. ‘పశ్చాత్తాపం, లాభం, ఏక్ దిన్ కా సుల్తాన్, ఆగండి ఆలోచించండి’ తదితర నాటకాల్లో నటించాను.
అలా వచ్చింది అవకాశం..
సింగీతం శ్రీనివాసరావుగారి దర్శకత్వంలో వచ్చిన ‘వసంతగీతం’ సినిమాలో తొలిసారిగా నటించాను. ఇప్పటి వరకు 200కు పైగా సినిమాల్లో నటించాను. ‘ఘరానామొగుడు, కూలీ నెం1, ప్రేమకు వేళాయెరా, ఉగాది’ తదితర సినిమాలు గుర్తింపునిచ్చాయి. ‘జై శ్రీరామ్’ సినిమాలో తొలిసారి విలన్ వేషం వేశాను. ‘వెయ్యి అబద్ధాలు’ సినిమాలో తేజ మరోసారి విలన్ వేషం ఇచ్చారు.ఎందరో మహానటులు నాటక రంగం నుంచి వచ్చిన వారే. జిల్లాలో త్వరలో బీజీఆర్ ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియో నిర్మాణం చేపడుతున్నాను. ఎక్కడ నిర్మించేది త్వరలోనే వెల్లడిస్తాను. తమిళ డైరెక్టర్ సాగా దర్శకత్వంలో త్వరలో సినిమా రూపొందిస్తున్నాం. ఆ సినిమాలో జిల్లాలో ఉన్న నటీనటులకు ప్రాధాన్యం ఇస్తాను. మే నెలాఖరుకు షూటింగ్ ప్రారంభిస్తాను.
నా కొడుకు కృష్ణకు గుర్తింపు వచ్చింది...
నా కుమారుడు కృష్ణంరాజును కృష్ణ పేరుతో సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం చేశాను. ‘లక్ష్మీదేవి సమర్పించు..నేడే చూడండి’ ఈ నెల ఏడున విడుదలై మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. ఈ సినిమాతో కృష్ణకు నటుడిగా మంచి మార్కులు వచ్చాయి. కృష్ణ మంచి డ్యాన్సర్ కావడంతో హీరో అవకాశం వచ్చింది.
Advertisement
Advertisement