ఈక్వెడార్‌లో భూవిలయం
♦ 7.8 తీవ్రతతో భూకంపం.. 235 మంది మృతి
♦ 1557 మందికి గాయాలు కుప్పకూలిన ఇళ్లు.. కొద్దిలో తప్పిన సునామీ ముప్పు!
క్విటో: దక్షిణ అమెరికా ఖండదేశం ఈక్వెడార్ చిగురుటాకులా వణికిపోయింది! శనివారం రాత్రి(స్థానిక కాలమానం ప్రకారం) 12 గంటలకు 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. 235 మంది దుర్మరణం పాలయ్యారు. 1557 మంది గాయపడగా అనేకమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మాంటా, పోర్టోవీజో, గుయాక్విల్ నగరాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెప్పారు. భూకంపం తర్వాత 55 సార్లు చిన్నపాటి ప్రకంపనలు వచ్చాయి. దేశ రాజధాని క్విటోకు వాయవ్య దిశలో 170 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
దాదాపు ఒక నిమిషం పాటు ఈక్వెడార్‌తోపాటు పెరూ ఉత్తర భాగం, కొలంబియా దక్షిణ ప్రాంతం కంపించింది. ఈక్వెడార్‌లోనే ఎక్కువ నష్టం చోటుచేసుకుంది. పలు ప్రాంతాల్లో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. తీర పట్టణమైన గుయాక్విల్‌లో ఓ వంతెన కుప్పకూలడంతో కారు ధ్వంసమైంది. భవనాలు ఊగిపోవడంతో జనం భయంతో పరుగులు తీశారు. దారుణంగా దెబ్బతిన్న పెడెర్నాలస్ పట్టణంలోనే 400 మంది మరణించి ఉంటారని భావిస్తున్నారు. అక్కడ 40 హోటళ్లు కుప్పకూలాయి. ‘నా జీవితంలో ఇంతటి తీవ్ర భూకంపం ఎన్నడూ చూడలేదు. భూమి చాలాసేపు కంపించింది. బయటకు పరుగెత్తాలనుకున్నా. కానీ కనీసం నడవలేకపోయా’ అని క్విటో వాసి టోరెస్ పేర్కొన్నారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న పెడెర్నాలెస్ పట్టణంలోని వందలమంది రాత్రంతా ఆరుబయటే పడుకున్నారు. ఈ పట్టణంలో పలువురు లూటీలకు పాల్పడ్డారని, ప్రజల్ని రక్షించేందుకు తాము ప్రాధాన్యమిస్తున్నామని స్థానిక అధికారులు వెల్లడించారు. విపత్తుపై దేశాధ్యక్షుడు రఫేల్ కొరెయ, ఉపాధ్యక్షుడు జార్జ్ గ్లాస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ.. నష్టం ఎక్కువగా చోటుచేసుకున్న ఆరు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. పోలీసు, సైన్యం, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. 10 వేల మంది సైన్యంతో పాటు 4,600 మంది పోలీసులు భూకంప బాధిత ప్రాంతాలకు తరలివెళ్లారు. పెడెర్నాలెస్, పోర్టోవీజో నగరాల్లో ప్రజలకు 3 వేల ఆహార పొట్లాల్ని, 8 వేల నిద్ర సామగ్రిని అందచేశారు. వాటికన్ సిటీ వెళ్లిన అధ్యక్షుడు రఫెల్ పర్యటన రద్దు చేసుకొని ఈక్వెడార్ బయల్దేరారు. భూకంపం తర్వాత సునామీ వచ్చే ప్రమాదం ఉన్నట్లు హవాయికి చెందిన సునామీ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. అయితే ఆ ప్రమాదం కొద్దిలో తప్పిపోయిందని, సునామీ ప్రమాదమేమీ లేదంటూ తర్వాత పేర్కొంది. భూగర్భంలో టెక్టానిక్ ఫలకాల సరిహద్దులపై ఈక్వెడార్ ఉండడంతో ఈ దేశంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. దీంతో 1900 నుంచి ఇప్పటివరకు రిక్టర్ స్కేల్‌పై 7.0 లేదా అంతకుమించిన తీవ్రతతో ఏడుసార్లు భూకంపాలు సంభవించాయి. 1987 మార్చిలో సంభవించిన భూకంపంలో వెయ్యి మంది మరణించారు.
జపాన్‌లో బిక్కుబిక్కుమంటూ...
కుమమొటో: జపాన్ భూకంప ప్రభావం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. చిన్న చిన్న ప్రకంపనలు భయపెడుతుండడంతో జనం ఇళ్లలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. ఒజు పట్టణంలోని పలువురు స్థానిక పార్కులో కార్లలో నిద్రిస్తున్నారు. కుమమొటో, మహిషి నగరాల్లో వేలాది మంది శనివారం రాత్రంతా ఆరుబయటే నిద్రించారు. జపాన్‌లో గురు, శనివారాల్లో వచ్చిన రెండు భూకంపాల ధాటికి 41 మంది మృతిచెందగా.. 1,500 మంది గాయపడ్డం తెలిసిందే. గల్లంతైన వారి కోసం జపాన్, అమెరికా వైమానిక దళాలు గాలిస్తున్నాయి. అసో పర్వత ప్రాంతంలో అదృశ్యమైన ఆరుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. మినమియాసో ప్రాంతంలో అదృశ్యమైన వారికోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. సహాయక కార్యక్రమాల్లో అమెరికా ఆర్మీ సాయం తీసుకుంటున్నామని ప్రధాని షింజో అబే తెలిపారు. ఇప్పటికీ కుమమొటోలో 80 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా లేదు. 4 లక్షల గృహాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. నగరంలో 200 ఇళ్లు, భవంతులు దెబ్బతిన్నాయని, 91 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని స్థానిక అధికారులు తెలిపారు.