రాత్రికి రాత్రే 70 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ!
లక్నో : ఉత్తరప్రదేశ్లో కుటుంబ రాజకీయ గొడవలకు అధికారులు సతమతమవుతున్నారు. రాత్రికి రాత్రే కనీస సమాచారం లేకుండా 70 మంది ఐపీఎస్ అధికారులను ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. దీనిలో పోలీసు చీఫ్లు కూడా ఉన్నారు. ఇప్పటికే అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్కు, ఆయన కుమారుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు గత కొంతకాలంగా విబేధాలు వచ్చాయి. మొదట అసమర్థుడైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, అనంతరం అవినీతి ఆరోపణలతో తన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌కు దగ్గరి వారైన ఇద్దరు మంత్రులను అఖిలేష్ తప్పించారు. దీంతో తండ్రీ కొడుకి మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. వీరిద్దరి వివాదాల వల్ల ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ కీలకపరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి.. ఈ నేపథ్యంలో 70 మంది ఇండియన్ పోలీసు సర్వీసు అధికారులకు ట్రాన్స్ఫర్లు చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది.
సీనియర్ హోమ్ డిపార్ట్మెంట్ అధికారుల ప్రకారం ఎక్కువగా ప్రాముఖ్యం పొందిన కాన్పూర్, మెయిన్పురి, ముజాఫర్నగర్, కాన్పూర్ రూరల్, ఫైజాబాద్, మధురా, ఫిరోజాబాద్, షామిలి, హపుర్, హర్దాయ్, జలాన్, చిత్రకూట్ జిల్లాల పోలీసు చీఫ్లను ప్రభుత్వం బదిలీ చేసినట్టు వెల్లడైంది. ఎస్పీకి పట్టుగొమ్ములాంటి మెయిన్పురి జిల్లాకు సునిల్ కుమార్ సక్సేనాను పోలీసు సూపరింటెండెంట్గా ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా అనంత్ డియోను సున్నితమైన పట్టణంగా పేరొందిన ఫైజాబాద్కు పోలీస్ చీఫ్గా బదిలీచేసింది. షలబ్ మాథుర్ను కాన్పూర్ నుంచి అలహాబాద్కు బదిలీచేసి కొత్త సీనియర్ పోలీసు సూపరింటెండెంట్గా పోస్టింగ్ ఇచ్చింది. జవహర్ బాగ్లో హింసాత్మక ఘటన నేపథ్యంలో సస్పెండ్ అయి, మథుర నుంచి ట్రాన్స్ఫర్ అయిన రాకేష్ సింగ్ను జలాన్ జిల్లాకు కొత్త ఎస్పీగా బదిలీ చేసింది. ఇలా ఇతర పోలీసు అధికారులను కూడా శుక్రవారం రాత్రి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బదిలీలు చేసింది. పోలీసు డిపార్ట్మెంట్లో జరిగిన ప్రధాన పునర్వ్యస్థీకరణ ఇదే. రాత్రికి రాత్రే ఈ బదిలీలు చేపట్టడంతో అసలు ఈ ట్రాన్స్ఫర్లకు కారణాలేమిటా అని సర్వత్రా చర్చనీయాశమైంది.