భారత్లో 70 లక్షల ఉద్యోగాలు కట్! | 70 lack jobs can disappear in coming 30 years: civil society group Prahar study | Sakshi
Sakshi News home page

భారత్లో 70 లక్షల ఉద్యోగాలు కట్!

Published Sun, Oct 16 2016 8:30 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

భారత్లో 70 లక్షల ఉద్యోగాలు కట్!

భారత్లో 70 లక్షల ఉద్యోగాలు కట్!

న్యూఢిల్లీ: ప్రస్తుతం చదువుకుంటున్న, ఇప్పటికే చదువులు పూర్తిచేసిన చాలామంది కల..  జాబ్.. జాబ్.. జాబ్! యువజనం అత్యధికంగా ఉన్న భారతదేశంలో వీళ్లందరికీ ఉద్యోగాలు దొరుకుతాయా? అసలు ఇండియాలో ఇప్పుడున్న ఉద్యోగాలెన్ని? పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతోందా? ఫలానా ఏడాదిలోగా ఆయా రంగాల్లో ఇంతమంది ఉద్యోగులను తొలగించబోతున్నారని ఇటీవల వెలువడుతున్న వార్తలు వాస్తవాలేనా? నిజంగానే ఉద్యోగాలు ఊడిపోతున్నాయా? నిరుద్యోగం కల్లోలం సృష్టించేరోజులు రాబోతున్నాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం ఎదురవుతోంది.

భారతదేశంలోని (2011 లెక్కల ప్రకారం) 121 కోట్ల జనాభాలో 50 శాతంమంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సంఘటిత(organised sector), అసంఘటిత (unorganised sector) రంగాలు రెండింటిలో కలిపి ఉద్యోగాల సంఖ్య 47 కోట్లు. అయితే ప్రస్తుతం వ్యవసాయ, రిటైల్, నిర్మాణ రంగాలతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు, నిర్మాణ కార్మికులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయా రంగాల్లో రోజుకు 550 ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయి. ఆ లెక్కన 2050నాటికి దేశంలో 70 లక్షల ఉద్యోగాలు మటుమాయం కానున్నాయి. అప్పటికి (2050నాటికి) మనదేశ జనాభా 180 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఢిల్లీకి చెందిన సామాజిక సంస్థ ప్రహర్ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఇలాంటి కళ్లు చెదిరే విషయాలెన్నో వెలుగులోకి వచ్చాయి. ఆ సంస్థ ఆదివారం తన రిపోర్టును విడుదలచేసింది.

లేబర్ బ్యూరో (2016 ప్రారంభంలో) విడుదలచేసిన గణాంకాల ప్రకారం 2015 సంవత్సరంలో దేశంలో కేవలం 1.35 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. అదే 2013లో 4.19 లక్షలు, 2009లో 9 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ 'దేశంలో పౌరుల జీవన ప్రమాణాలు పెరగాల్సిందిపోయి తరగిపోతున్నాయని, ఉద్యోగాలు సృష్టించే ప్రక్రియ చాలా మందగించింది'అని అద్యయనంలో పేర్కొన్నారు. రోజుకు 550 ఉద్యోగాలు మాయం అవుతున్న విషయాన్ని లేబర్ బ్యూరో కూడా నిర్ధారించిందని ప్రహర్ రిపోర్టు తెలిపింది. కొత్త ఉద్యోగాలు కల్పించుకునే అవకాశం ఉన్న రంగాల్లో తీవ్ర మాంధ్యం ఏర్పడటమే నిరుద్యోగం పెరుగుదలకు కారణమని వివరించింది.

'ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం 1994లో (దేశజనాభాలో) 60 శాతం మంది వ్యవసాయ రంగంలోనే ఉపాధి ఉండేది. కానీ 2013 నాటికి అది 50 శాతానికి పడిపోయింది. వ్యవసాయం తర్వాత 40 శాతం ఉద్యోగాలను కలిగిఉన్న చిన్న, మధ్యతరగతి పరిశ్రమల రంగం.. మల్టీనేషన్ కంపెనీల రాకతో కుదేలయ్యేపరిస్థితి నెలకొంది. పెద్ద పెద్ద పరిశ్రమల్లో ఉద్యోగాలు చేస్తున్నవారి కంటే నాలుగు రెట్లు ఎక్కువ మంది చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో పనిచేస్తుండటం గమనార్హం'అని రిపోర్టులో పేర్కొన్నారు..

ఉద్యోగాల కల్పన కోసం భారత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన 'మేక్ ఇన్ ఇండియా' వారోత్సవాల్లో పలు మల్టీ నేషన్ కంపెనీల నుంచి దాదాపు 225 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించింది. వచ్చే ఐదేళ్లలో ఆయా పెట్టుబడులకు సంబంధించిన క్షేత్రస్థాయి పనులు ప్రారంభం అవుతాయి. కానీ తద్వారా 60 లక్షల కొత్త ఉద్యోగాలైనా లభిస్తాయా లేదా అనేది చెప్పలేమని ప్రహర్ రిపోర్టు  పేర్కొంది. భారతదేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పునర్జీవనం కల్పిస్తే తప్ప పరిస్థితులు చక్కబడవని, ఆమేరకు ప్రభుత్వాలు దృష్టిసారించాలని సామాజిక అధ్యయన సంస్థ సూచించింది. 21వ శతాబ్దపు ఇండియాకు స్మార్ట్ సిటీలకన్నా స్మార్ట్ విలేజ్ల అవసరం ఉందని అబిప్రాయపడింది.

Advertisement
Advertisement