342 ఆత్మహత్యలే నిజమైనవి
రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్
⇒ కోదండరామ్ సూచనలు పాటిస్తాం
⇒ ఆయన్ను చర్చలకు ఆహ్వానిస్తున్నాం
⇒ నివారణకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నాం
⇒ గత ప్రభుత్వాల విధానాల వల్లే రైతులకు ఇబ్బందులు
⇒ రైతులకు 7గంటల నాణ్యమైన కరెంటిస్తున్నాం
⇒ మద్దతు ధరపై తుది నిర్ణయం కేంద్రానిదేనన్న ప్రభుత్వం
⇒ వ్యాజ్యాన్ని మూసేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్:‘తెలంగాణ రాష్ట్రంలో 2014 జూన్ 2 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 8 వరకు హైదరాబాద్ మినహా మిగతా 9 జిల్లాల్లో 782 రైతు ఆత్మహత్యలు జరిగాయి. వీటిలో 673 కేసులను త్రిసభ్య కమిటీ విచారించింది. 342 ఆత్మహత్యలే అసలైనవిగా తేల్చింది’’ అని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. ఈ 342 ఆత్మహత్యల్లో 313 కేసుల్లో ఎక్స్‌గ్రేషియా, రిలీఫ్ ఫండ్ అందచేశామని పేర్కొంది. ‘రైతుల పరిస్థితిని చూస్తూ మేమెంతమాత్రమూ నిర్లిప్తంగా లేము.
రైతు సమస్యల పరిష్కారం విషయంలో కోర్టు ఇచ్చే ఏ సలహా, సూచననైనా చిత్తశుద్ధితో అమలు చేస్తాం’’ అని స్పష్టం చేసింది. ‘రైతు ఆత్మహత్యలను నివారించి, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రొఫెసర్ కోదండరాం ఇచ్చే సూచనలు, సలహాలను పాటిస్తాం. ఇందుకు ఆయనను చర్చలకు ఆహ్వానిస్తున్నాం’ అని కోర్టుకు వివరించింది. రైతుల ఆత్మహత్యలను మానవ హక్కుల అంశంగా పరిగణిస్తున్నామని, వాటి నివారణకు చిత్తశుద్ధితో అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.
కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అందక, రుణ బాధల వంటివాటి కారణంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, వాటిపై దాఖలైన వ్యాజ్యాల్లో తనను ప్రతివాదిగా చేర్చుకుని తన వాదనలు వినాలని కోరుతూ తెలంగాణ విద్యావంతుల వేదిక గౌరవాధ్యక్షుని హోదాలో కోదండరాం హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేయడం, అందులో ఆయన లేవనెత్తిన అంశాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించడం తెలిసిందే.
ఆ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి గురువారం కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. కోదండరాం ప్రధానంగా లేవనెత్తిన ఎంఎస్‌పీ అంశం తమ పరిధిలో మాత్రమే లేదని, దానిపై అంతిమ నిర్ణయం కేంద్రానిదేనని కౌంటర్‌లో ప్రభుత్వం వివరించింది. కోదండరాం తన పిటిషన్‌లో లేవనెత్తిన పలు అంశాలతో తాము విభేదించడం లేదంది. ‘‘రైతుల సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు సరైన ఫలితాలివ్వలేదు. దాంతో రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు.
మా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టగానే పలు రైతు ఉపశమన చర్యలు చేపట్టాం. విద్యుత్ సమస్యపై దృష్టి పెట్టి కొంతవరకు అధిగమించాం. పంటల బీమా పథకం కింద గ్రామాన్ని, మండలాన్ని కాకుండా రైతును యూనిట్ తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం’’ అని తెలిపింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని మూసేయాల్సిందిగా కోరింది. కౌంటర్‌లో ప్రభుత్వం ప్రస్తావించిన అంశాలు...
కొని మరీ రైతులకు కరెంటిస్తున్నాం
తెలంగాణలో ఏకంగా 41.43 లక్షల హెక్టార్లలో వ్యవసాయం వర్షాధారమే. పైగా సరైన నీటి వనరులూ లేవు. చెరువులు, బోర్లే ప్రధాన నీటి వనరులు. దాంతో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి మరీ వారికి 7 గంటల నాణ్యమైన కరెంటిస్తున్నాం. రైతులకు సరిపోయేలా ఎంఎస్‌పీని నిర్ణయించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. కానీ దీనిపై కేంద్రం తన పరిమితులకు లోబడి నిర్ణయం తీసుకుంటుం డటంతో విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఎంఎస్‌పీ ఖరారులో ఉత్పత్తి వ్యయంపై అదనంగా 50% వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రానికి సిఫార్సు చేస్తున్నాం. రైతులకు రూ.లక్ష వరకు వడ్డీ లేని రుణాన్ని ప్రకటించాం. రూ.1 నుంచి రూ.3 లక్షల వరకు పావలా వడ్డీనీ ప్రకటించాం. ఈ రెండు పథకాల కింద ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రాయితీ రూపేణా రూ.224 కోట్లు అందుబాటులో ఉంచాం. వీటిలో రూ.42 కోట్లను బ్యాంకులకు విడుదల చేశాం. విత్తనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నాం.
పంటల బీమా పథకానికి ఈ ఆర్థిక సంవత్సరం రూ.139.77 కోట్లు కేటాయించాం. ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాదికి 1,240 హెక్టార్లలో వర్షాధార ప్రాంతాభివృద్ధి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించాం. ఖరీఫ్‌లో 713.6 మి.మీ. వర్షపాతం కురవాల్సింది 2014లో 494.7, 2015 ఖరీఫ్‌లో 611 మిల్లీమీటర్లే కురిసింది.
దాంతో మొత్తం 444 మండలాల్లో 231 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాం. రాష్ట్రంలో చెరువులు, కుంటల్ని వినియోగంలోకి తెచ్చేందుకు మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభించాం. దీనివల్ల 255 టీఎంసీల నీటిని సమర్థంగా వాడుకోవడం సాధ్యమవుతుంది. వచ్చే ఐదేళ్లలో ఈ పథకం కింద 46,531 చెరువులను పునరుద్ధరించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం.