రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నివేదిక ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రధానమంత్రి సూచించిన రోడ్ మ్యాప్‌లో పేర్కొన్న విధంగా నిధులు, ప్యాకేజీ, ఇతర అంశాలపై నివేదికను త్వరగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సంస్థ వైస్ చైర్మన్ అరవింద్ పణగారియాను కోరారు. శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి.. మధ్యాహ్నం నీతిఆయోగ్‌లో పణగారియాతో సమావేశమయ్యారు. విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్రం చట్టబద్ధంగా ఇవ్వాల్సిన నిధులు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ తదితర అన్ని అంశాలతో కూడిన ఆర్థిక సిఫారసుల నివేదికకు నీతి ఆయోగ్ తుది మెరుగులు దిద్దుతోంది.
దీన్ని వేగవంతం చేయాలని చంద్రబాబు కోరారు. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని పణగారియా, సీఎంకు వివరించా రు. సాయంత్రం ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో జరుగుతున్న ‘ఢిల్లీ ఎకనమిక్స్ కాంక్లేవ్-2015’లో పాల్గొని సీఎం ప్రసంగించారు. అనంతరం సీఐఐ ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు.
జామ్‌తో పేదరిక నిర్మూలన సాధ్యం
ఆర్థిక విధానాలు స్వచ్ఛ రాజకీయాలకు నాంది పలుకుతాయని, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో జన్‌ధన్, ఆధార్, మొబైల్ అనుసంధానం (జామ్) పేదరిక నిర్మూలనకు దోహదపడడం ఇందుకు తార్కాణమని చంద్రబాబు పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన కోసం వేల కోట్ల సబ్సిడీలు, రాయితీలు ఇస్తున్నా.. వాటి లక్ష్యం నెరవేరడం లేదని వివరించారు. ఎరువులపై వెచ్చిస్తున్న రూ.73,790 కోట్ల సబ్సిడీ.. ఎరువుల తయారీదారులకే ప్రయోజనకారిగా మారిందన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ, ఉపకార వేతనాల పంపిణీ కూడా లీకేజీ పాలవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.
8.58 లక్షల బోగస్ కార్డులు ఏరివేశాం
‘దళారులు, లీకేజీలు అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకున్నాం. 8.58 లక్షల బోగస్ కార్డులను ఏరివేశాం. 8.17 లక్షల ఉపాధి లబ్ధిదారుల అక్రమ కార్డులను తొలగించాం. అలాగే 1.5 లక్షల పెన్షనర్లను తొలగించాం. ఆధార్ ఆధారిత చెల్లింపుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే దాదాపు రూ. 744 కోట్లు ఆదా చేశాం. రానున్న సంవత్సరాల్లో ఇది మరింత పెరుగుతుంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
సీఐఐ ప్రతినిధులు భేటీ..
ఫిబ్రవరి 18, 19, 20, 21 తేదీల్లో విశాఖలో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ బయోటెక్నాలజీ సదస్సుకు హాజరు కావాలని కోరుతూ సీఐఐ ప్రతినిధులు ఇక్కడ ముఖ్యమంత్రిని కలిశారు.
బాక్సైట్‌పై చర్చిస్తాం : సీఎం
బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ నుంచి ఏపీఎండీసీకి అనుమతులు వచ్చాయని, తవ్వకాలపై అందరితో చర్చిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. దీన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. గిరిజనుల ప్రయోజనాలు కాపాడుతామని, అందుకు ఎలా చేయాలో అలా చేస్తామని చెప్పారు. శుక్రవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా పలు సమావేశాల్లో సీఎం పాల్గొన్నారు. అనంతరం రాత్రి విలేకరులతో మాట్లాడారు.