
Aakash 4
న్యూఢిల్లీ: ఆకాశ్ ట్యాబ్లెట్‌లో తర్వాతి వెర్షన్, ఆకాశ్ 4 ఉత్పత్తి వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుందని టెలికాం మంత్రి కపిల్ సిబల్ గురువారం తెలిపారు.ప్రపంచంలోనే అత్యంత చౌకైన ట్యాబ్లెట్‌గా ప్రాచుర్యం పొందిన ఈ ఆకాశ్ ట్యాబ్లెట్ల ధర ప్రస్తుతం రూ. 2,500 అని, ఏడాది కాలంలో రూ. 1,000 తగ్గి రూ.1,500కు చేరగలదని అంచనాలున్నాయని పేర్కొన్నా రు. ఇక్కడి మోడర్న్ స్కూల్ విద్యార్థ్ధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆకాశ్ 4 ట్యాబ్లెట్ల తయారీ కోసం ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించిందని, ఈ బిడ్లను నేడు (శుక్రవారం) తెరుస్తామని సిబల్ పేర్కొన్నారు. 5 నుంచి 7 ఏళ్లలో స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఆశాశ్ ట్యాబ్లెట్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు.
భవిష్యత్తులో చదువు నేర్చుకోవడాన్ని ఆకాశ్ వంటి పరికరాలు, అధునాతన టెక్నాలజీలు సమూలంగా మార్చివేస్తాయని కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. విద్యార్థులు వివిధ నెట్‌వర్క్‌ల నుంచి విజ్ఞానం పొందగలరని పేర్కొన్నారు. కాగా ఆకాశ్ 4లో 7 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్క్రీన్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ వరకూ ఎక్స్‌పాండబుల్ చేసుకోవడానికి మెమెరీ కార్డ్ స్లాట్, బ్లూటూత్, వైఫై, ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. 2జీ, 3జీ, 4జీలను సపోర్ట్ చేస్తుంది.