కేజ్రివాల్ దీక్ష శిబిరం వద్ద ఘర్షణ, ఉద్రిక్తం!
కేజ్రివాల్ దీక్ష శిబిరం వద్ద ఘర్షణ, ఉద్రిక్తం!
Published Mon, Jan 20 2014 7:27 PM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ దీక్షా శిబిరం వద్ద పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాదక ద్రవ్యాల, వ్యభిచార రాకెట్ పై దాడులు జరుపడానికి నిరాకరించిన పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆరుగురు మంత్రులతోపాటు కేజ్రీవాల్ సోమవారం ఉదయం దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.
ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులను ఉద్రేక పరిచేవిధంగా కేజ్రివాల్ ప్రసంగిస్తుండగా పోలీసులు ఆడియో సిస్టమ్ కనెక్షన్ తొలగించడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ నేతలతోపాటు సంజయ్ సింగ్, ఇతర జర్నలిస్టులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఢిల్లీ రవాణా శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఎమ్మెల్యే అఖిలేష్ త్రిపాఠిని విచక్షణారహితంగా కొట్టారని కేజ్రివాల్ ట్వీట్ చేశారు. గాయపడిన త్రిపాఠికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నట్టు ఆమ్ నేతలు తెలిపారు. దీక్షా వేదిక వద్ద 3 వేల పోలీసులను నియమించారు. దీక్షా శిబిరం నుంచే కేజ్రివాల్ ఫైళ్లను క్లియర్ చేశారు. దీక్ష వల్ల ప్రభుత్వం పనిచేయడం ఆగిపోదని ఆయన వెల్లడించారు.
Advertisement
Advertisement