ఒక్కో టికెట్.. 2 నుంచి 2.5 కోట్లు
చండీగఢ్: అవినీతి ఆరోపణల కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ కన్వీనర్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సుచాసింగ్ చోటేపూర్ పార్టీ ఢిల్లీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆప్ ఢిల్లీ నేతలు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కోట్లాది రూపాయలకు టికెట్లు అమ్ముకుంటున్నారని బాంబు పేల్చారు. ఆప్ కేంద్ర నాయకత్వం పంజాబ్కు చెందిన ఏ నాయకుడినీ పార్టీలో ఎదగనీయడం లేదని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. రెండు నుంచి రెండున్నర కోట్ల రూపాయలు తీసుకుని ఆప్ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు.
గురుదాస్పూర్ జిల్లా నుంచి పరివర్తన్ యాత్రను సుచాసింగ్ ప్రారంభించారు. ఢిల్లీ ఆప్ నేతల వల్ల తనకు, పంజాబ్ ప్రజలకు జరిగిన అన్యాయం గురించి పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు వివరిస్తానని చెప్పారు. పార్టీ కోసం పగలు, రాత్రి కష్టపడ్డానని, సొంత డబ్బు ఖర్చు చేశానన్నారు. పంజాబ్, ఎన్ఆర్ఐల నుంచి వసూలు చేసిన నిధుల గురించి తనకు ఏమాత్రం చెప్పలేదని, ఎన్ఆర్ఐలు ఇచ్చిన కోట్లాది రూపాయలను ఆప్ ఢిల్లీ నేతలు తీసుకెళ్లారని చెప్పారు. పంజాబ్లో పార్టీకి కోశాధికారిని కూడా నియమించలేదని తెలిపారు. పంజాబ్లో ఆప్కు బ్యాంక్ ఎకౌంట్ లేదని, నిధులన్నీ ఢిల్లీకి తీసుకెళ్లారని సుచాసింగ్ అన్నారు.