sucha singh chhotepur
-
ఒక్కో టికెట్.. 2 నుంచి 2.5 కోట్లు
చండీగఢ్: అవినీతి ఆరోపణల కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ కన్వీనర్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సుచాసింగ్ చోటేపూర్ పార్టీ ఢిల్లీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆప్ ఢిల్లీ నేతలు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కోట్లాది రూపాయలకు టికెట్లు అమ్ముకుంటున్నారని బాంబు పేల్చారు. ఆప్ కేంద్ర నాయకత్వం పంజాబ్‌కు చెందిన ఏ నాయకుడినీ పార్టీలో ఎదగనీయడం లేదని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. రెండు నుంచి రెండున్నర కోట్ల రూపాయలు తీసుకుని ఆప్ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. గురుదాస్‌పూర్ జిల్లా నుంచి పరివర్తన్ యాత్రను సుచాసింగ్ ప్రారంభించారు. ఢిల్లీ ఆప్ నేతల వల్ల తనకు, పంజాబ్ ప్రజలకు జరిగిన అన్యాయం గురించి పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు వివరిస్తానని చెప్పారు. పార్టీ కోసం పగలు, రాత్రి కష్టపడ్డానని, సొంత డబ్బు ఖర్చు చేశానన్నారు. పంజాబ్, ఎన్ఆర్ఐల నుంచి వసూలు చేసిన నిధుల గురించి తనకు ఏమాత్రం చెప్పలేదని, ఎన్ఆర్ఐలు ఇచ్చిన కోట్లాది రూపాయలను ఆప్ ఢిల్లీ నేతలు తీసుకెళ్లారని చెప్పారు. పంజాబ్‌లో పార్టీకి కోశాధికారిని కూడా నియమించలేదని తెలిపారు. పంజాబ్‌లో ఆప్‌కు బ్యాంక్ ఎకౌంట్ లేదని, నిధులన్నీ ఢిల్లీకి తీసుకెళ్లారని సుచాసింగ్ అన్నారు. -
'వాడి.. పారేయ్' నుంచి 'నాశనం చేయ్' వరకు!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతంలో గణనీయంగా మార్పు వచ్చిందని, ఒకప్పుడు నేతలను 'వాడి పారేయడం' ఆ పార్టీ సిద్ధాంతంగా ఉండేదని, ఇప్పుడు 'వాడి నాశనం చేయ్' అన్నట్టు ఆ పార్టీ సిద్ధాంతం మారిందని ఆప్ మాజీ నేత యోగేంద్ర యాదవ్ విమర్శించారు. తాజాగా సుచాసింగ్ ఛోటెపర్‌ను పార్టీ పంజాబ్ కన్వీనర్ పదవి నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో ఆప్‌పై ఆ పార్టీ బహిష్కృత నేత అయిన యోగేంద్ర యాదవ్ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆప్ రెబెల్ ఎమ్మెల్యే పంకజ్ పుష్కర్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం భావప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్నదని, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గొంతెత్తకుండా అడ్డుకుంటున్నదని మండిపడ్డారు. టికెట్ ఆశావహుల నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై ఛోటెపర్‌ను ఆప్ పదవి నుంచి తొలగించింది. -
పార్టీ టికెట్లు అమ్ముకుంటూ.. స్టింగ్‌కు దొరికేశాడు
పంజాబ్‌లో ఎన్నికలకు వెళ్లడానికి తమ దగ్గర డబ్బులు లేవంటూ సాక్షాత్తు పార్టీ ముఖ్య నాయకుడే చెప్పారు కదా అనుకున్నారో ఏమో గానీ.. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ కన్వీనర్ ఓ కార్యకర్తకు టికెట్ ఇప్పిస్తానంటూ అతడి దగ్గర డబ్బులు తీసుకుంటూ దొరికిపోయారు. దాంతో పార్టీ రాష్ట్రశాఖ కన్వీనర్ సుచా సింగ్ ఛోటేపూర్‌పై బహిష్కరణ వేటు వేయాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఛోటేపూర్‌పై చర్య తీసుకోవాలంటూ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు దాదాపు 25 మంది పంజాబ్ అగ్రనేతలు లేఖ రాశారు. అయితే, ఇదంతా తన సొంత పార్టీ వాళ్లు చేసిన కుట్రేనని, ఆరోపణలు నిరాధారమని ఛోటేపూర్ అంటున్నారు. అన్ని విషయాలూ త్వరలోనే వెల్లడిస్తానన్నారు. కానీ ఛోటేపూర్ డబ్బులు తీసుకుంటుండగా స్టింగ్ ఆపరేషన్ చేశామని, ఆ వీడియో ఇప్పటికే అధిష్ఠానం వద్దకు వెళ్లిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీలో అవినీతికి చోటు లేదని, సాక్ష్యాధారాలు అగ్రనేతలకు చేరితే ఛోటేపూర్‌పై తప్పకుండా కఠినచర్యలు ఉంటాయని పార్టీ అధికార ప్రతినిధి హిమ్మత్‌సింగ్ షేర్గిల్ చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకస్థుడైన ఛోటేపూర్ గత ఎన్నికల్లో గురుదాస్‌పూర్ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల పంపిణీపై ఛోటేపూర్ కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు, కేజ్రీవాల్‌కు చెడిందని చెబుతున్నారు. ఇప్పటికి రెండు జాబితాలను పార్టీ విడుదల చేసినా, రెండుసార్లూ ప్రెస్మీట్లలో ఛోటేపూర్ లేరు.