మానవత్వం చూపిన రాష్ట్రపతి తనయుడు
బురద్వాన్(పశ్చిమ బెంగాల్): రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ.. మానవీయత చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితురాలిని ఆస్పత్రికి తరలించి ఆదుకున్నారు. అంతేకాదు మెరుగైన వైద్యం కోసం ఆమెను మరో ఆస్పత్రికి తరలించేందుకు సహాయపడ్డారు.
బాధితురాలు సుమితాపాల్ ఆదివారం తన కుమారుడు ఆర్ఘ్యతో కలిసి మోటారు సైకిల్ పై బురద్వాన్ నుంచి గస్కరాలోని ఆలయానికి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. సుమితాపాల్ కింద పడిపోవడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఆర్ఘ్యకు ఏమీ తోచలేదు. అదేదారిలో వెళుతున్న అభిజిత్ విషయం తెలుసుకుని తన కారులో సుమితాపాల్ ను హుటాహుటిన గస్కరా ఆస్పత్రికి తరలించారు. బురద్వాన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించడంతో వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ తో మాట్లాడి ఆమెకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. అంతేకాదు వైద్యఖర్చుల కోసం కొంత డబ్బు కూడా ఆర్ఘ్యకు అందజేశారు.
తాను ప్రత్యేకంగా చేసిందేమీ లేదని, సాటి మనిషిగా సాయం చేశానని అభిజిత్ ముఖర్జీ తెలిపారు. ముర్షిదాబాద్ లోని జంగీపూర్ లోక్ సభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రమాద బాధితురాలిని స్వయంగా ఆస్పత్రికి తీసుకొచ్చిన ఆయనను పలువురు ప్రశంసించారు.