
మత గురువు వ్యాఖ్యలపై భగ్గుమన్న కేరళ
తిరువనంతపురం: ‘ఆడవాళ్లున్నది పిల్లలు కనేందుకే’ అంటూ కేరళలో సున్నీ మతగురువు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ముస్లియర్ ఈ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ అన్ని రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.
కోజికోడ్లో ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ సమావేశంలో మాట్లాడుతూ అబూబకర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఎప్పటికీ పురుషులతో సమానం కాదు.. వారు కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే సరిపోతారంటూ వ్యాఖ్యానించారు. మహిళలకు మానసిక బలం ఉండదని, దేనినైనా నియంత్రించే శక్తి వారికి లేదన్నారు. ఇటువంటి విషయాలు మగవారిమే సాధ్యమని చెప్పారు. స్త్రీ, పురుష సమానత్వం అనేది ఎప్పటికీ సాధ్యం కాదనేది వాస్తవమన్నారు.