అబూ జుందాల్కు జీవితఖైదు
ముంబై: సుదీర్ఘ విచారణ తర్వాత ఔరంగాబాద్ ఆయుధాల అక్రమ రవాణా కేసులో ఉగ్రవాది సయ్యద్ జుబేదిన్ అన్సారీ అలియాస్ అబూ జుందాల్ కు జీవితఖైదు పడింది. గత వారమే జుందాల్, అతని గ్యాంగ్ ను దోషులుగా నిర్ధారించిన మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (మోకా) కోర్టు మంగళవారం శిక్షలు ఖరారుచేసింది. అబూ జిందాల్ కాకుండా మరో ఆరుగురు దోషులకు జీవితఖైదు విధిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. కాగా, జుందాల్ పై 26/11 ముంబై దాడుల కేసు విచారణలో ఉంది. ఔరంగాబాద్ ఆయుధాల అక్రమరవాణా కేసులో మొత్తం 12 మంది దోషులుగా తేలారు. వారిలో అబూ జిందాల్ సహా మరో ఏడుగురికి జీవిత ఖైదు పడింది. ఇద్దరికి 14 ఏళ్లు, ముగ్గురికి 8 ఏళ్లు జైలు శిక్షలు పడ్డాయి.
మోదీ హత్యకు కుట్ర
2002 గుజరాత్ అల్లర్ల తర్వాత నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని, విశ్వహిందూ పరిషత్ కీలక నేత ప్రవీణ్ తొగాడియానూ హత్య చేసేందుకు అబూ జుందాల్ అండ్ గ్యాంగ్ కుట్రపన్నారని పోలీసులు సాక్ష్యాధారాలతో నిరూపించడంతో శిక్షలు పడ్డాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన జుందాల్.. మాలేగావ్ కేంద్రంగా మోదీపై కుట్రలు పన్నాడు. ప్లానింగ్ లో భాగంగా 2006, మే 8న.. 30 కేజీల ఆర్డీఎక్స్, 10 ఏకే 47 తుపాకులు, 3,200 బులెట్లతో కారులో బయలుదేరిన జుందాల్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆయుధాలు పట్టుబడినప్పటికీ అబూ జుందాల్ మాత్రం తప్పించుకున్నాడు.
ముంబై దాడుల్లో హస్తం
బంగ్లాదేశ్ కు పారిపోయిన అబూ అక్కణ్నుంచి సౌదీకి, సౌదీ నుంచి పాకస్థాన్ కు వెళ్లాడు. 2008 నవంబర్ 26న లష్కరే తాయిబా ఉగ్రవాదులు బై మారణహోం సృష్టించిన సమయంలో అబూ పాకిస్థాన్ లోనే ఉన్నాడు. ముంబై దాడుల సూత్రధారి, లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ కు అబూ అన్నిరకాలుగా సాయపడ్డాడని దర్యాప్తు బృందాలు నిర్ధారించాయి. 2012లో అనూహ్యంగా సౌదీ అరేబియాలో పోలీసులకు పట్టుబడ్డ అబూ జిందాల్ ను నేరస్తుల అప్పగింత ఒప్పందంలో భాగంగా భారత్ కు తీసుకొచ్చారు.