హీరో విశాల్ పై దాడి
చెన్నై : హీరో విశాల్పై ప్రముఖ నటుడు శరత్కుమార్ వర్గీయులు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో విశాల్ ఎడమ చేతికి గాయమైంది. వెంటనే సన్నిహితులు ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే నడిగర్ సంఘం ఎన్నికల్లో ఓటమి భయంతోనే తనపై దాడికి పాల్పడుతున్నారని విశాల్ ఆరోపించారు. నడిగర్ సంఘం ఎన్నికలు ఆదివారం ఆళ్వార్పేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే పలువురు ప్రముఖ నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గత పదేళ్లుగా నడిగర్ సంఘానికి ప్రముఖ నటుడు శరత్కుమార్ బృందం కార్య నిర్వాహకవర్గంగా కొనసాగుతుంది. అయితే ఈ ఏడాది కూడా ఆ బృందమే పదవీ బాధ్యతలు కొనసాగాలని భావించింది. అయితే ప్రముఖ నటుడు విశాల్ బృందం జట్టు కూడా ఈ సంఘం బాధ్యతలు చేపట్టేందుకు ఉత్సాహాన్ని చూపింది. దీంతో ఈ సంఘానికి ఎన్నికలు అనివార్యమైంది. అంతేకాకుండా అటు శరత్కుమార్ జట్టు... ఇటు విశాల్ జట్ల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నాయి. చివరికి ఈ రెండు జట్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో ఆళ్వార్ పేట పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ రోజు సాయంత్రం ప్రకటించనున్నారు.