అదరగొడుతున్న అదానీ పోర్ట్స్
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ పోర్ట్స్ ప్రకటించిన తొలి త్రైమాసిక ఫలితాల జోరుతో మార్కెట్లో షేర్లు సంచలనాలు సృష్టిస్తున్నాయి. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(సెజ్) షేర్లు బుధవారం ట్రేడింగ్లో 8 శాతం మేర జంప్ అయి, 257.35 వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీ మార్నింగ్ ట్రేడింగ్లో అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్గా నిలిచి 7నెలల గరిష్టాన్ని తాకింది. దేశీయ అతిపెద్ద పోర్ట్ డెవలపర్ గా ఉన్న అదానీ పోర్ట్స్ 2016-17 ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో, తన లాభాలు 31 శాతం ఎగిసినట్టు ప్రకటించింది. క్యూ1లో రూ.1,826.58 కోట్ల మొత్తం ఆదాయాలపై రూ. 836 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాలు ఆర్జించినట్టు తెలిపింది.
అదేవిధంగా గతేడాది ఇదే త్రైమాసికంలో 39.61 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్న కార్గో వాల్యుమ్ 42.33 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగినట్టు ఫలితాల్లో పేర్కొంది. కంపెనీ ఫలితాల ప్రకారం.. అదానీ పోర్ట్స్ వాల్యుమ్ ఈ త్రైమాసికంలో 7 శాతం ఎగిసింది. కార్గో వాల్యుమ్లో బలమైన వృద్ధి, కార్యాచరణ సామర్థ్యాలు, తాము అనుసరించిన వ్యూహాలు బల్క్ కార్గో వాల్యుమ్ను పెంచి కంపెనీకి లాభాలను చేకూర్చాయని కంపెనీ సీఈవో కరణ్ అదానీ చెప్పారు. గ్లోబల్గా ట్రేడ్ వాల్యుమ్స్ పెంచుకోవడం అదానీ పోర్ట్స్కు మరింత లబ్దిని చేకూరుస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేవరకు పార్టీ అడ్వాన్స్లకు కంపెనీ కోత విధించినున్నట్టు పేర్కొంది. దీంతో పార్టీ రుణాలను కంపెనీ తగ్గించుకోనుంది. ఈ ప్రకటన పెట్టుబడిదారుల్లో కొత్త ఆశలు చిగురించింది. గత మూడేళ్లలో ఈ రుణాలు 5.8 టైమ్స్ పెరిగాయి. ఈ ప్రకటనలతో మార్కెట్లో అదానీ పోర్ట్స్ షేర్లు దూసుకెళ్తున్నాయి.