టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దాదాపు 14 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడుతున్నారు.
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దాదాపు 14 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్నారు. అది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో. అక్టోబర్ 22వ తేదీన జరిగే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కానున్నారు.
అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... ఆదివారం కేసీఆర్ను స్వయంగా కలిసి ఆహ్వానించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆహ్వానంపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. అమరావతి పర్యటనలో వెళ్లే ముందు కేసీఆర్ 21వ తేదీ రాత్రి నల్గొండ జిల్లా సూర్యాపేట చేరుకుంటారు. 22వ తేదీ ఉదయం హెలికాప్టర్లో ఆయన గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో అమరావతి వెళ్తారు.
కాగా అయిదేళ్ల క్రితమే కేసీఆర్ ఆంధ్రాలో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటన రద్దు అయింది. 2010లో దళిత కవి కత్తి పద్మారావు విజయవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రావాలంటూ కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఇంతలో లైలా తుపాన్ రావటంతో సభ వాయిదా పడింది. దీంతో కేసీఆర్ అక్కడకు వెళ్లలేకపోయారు.
అలాగే మలివిడత తెలంగాణ ఉద్యమం సమయంలో రాష్ట్ర విభజన వల్ల కలిగే లాభాలను కోస్తాంధ్రలో పర్యటించి.... ఆ ప్రాంత వాసులకు వివరించాలని కేసీఆర్ భావించారు. ఆ నిర్ణయాన్ని అప్పటి కాంగ్రెస్ పార్టీ నేతలు లగడపాటి రాజగోపాల్, టీజీ వెంకటేశ్లు స్వాగతించారు. అయితే రాష్ట్ర విభజన ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ అక్కడ పర్యటిస్తే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అందరి దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుంటానంటూ తిరుమల శ్రీవెంకటేశ్వరుడితోపాటు విజయవాడ కనకదుర్గమ్మను కేసీఆర్ ప్రార్థించారు. దేవుళ్ల దీవెనలు కూడా తోడై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. దీంతో కేసీఆర్ అప్పుడు మొక్కిన మొక్కులు మాత్రం బాకీ ఉన్నాయి. ఈ మొక్కుల కోసం కేసీఆర్ ప్రభుత్వం 5.59 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది కూడా. కేసీఆర్ అమరావతి పర్యటన అనంతరం మరో రెండు నెలల్లో తిరుమల,విజయవాడల్లో ఈ మొక్కులను తీర్చుకునే అవకాశం ఉందని సమాచారం.