65 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ!
దాదాపు 65 ఏళ్లు.. ఒకరినొకరు చూసుకొని, ఒకరితో ఒకరు మాట్లాడుకొని..! ఇన్నాళ్లు వేచి చూస్తూ.. ఎలాగోలా కాలం గడిపిన ఆ వృద్ధ దంపతులు కలుసుకునే క్షణం రానేవచ్చింది. ఓ క్షణం ఉత్కంఠ, ఓ క్షణం ఉద్విగ్నత. ఎలా మాట్లాడుకోవాలో, ఏమని పలుకరించుకోవాలో తెలియని సందిగ్ధత.. చూసుకోవడంతోనే వారి హృదయాలు ఉప్పొంగాయి. కన్నీళ్లు వాటంతటవే ఉబికాయి.. ఇది లీ సూన్-గ్యూ-ఓహ్ ఇన్ సే దంపతుల అనుభవం. ఇరు కొరియాల మధ్య యుద్ధం రాజుకోవడంతో 1950, సెప్టెంబర్లో పెళ్లయిన కొన్నాళ్లకే విడిపోయిన వాళ్లు.. ఆరున్నర దశాబ్దాలు వేచివేచి.. ఆఖరికి కలుసుకోగలిగారు.
కొరియాల యుద్ధం వల్ల వేరైన కుటుంబాల కలయిక కార్యక్రమం సందర్భంగా మంగళవారం వీరి అపూర్వ పునఃసంగమం సాధ్యపడింది. లీ సూన్ భార్యతో వేరయ్యే నాటికి 19 ఏళ్ల ఆమె ఆరు నెలల గర్భవతి. ఇప్పుడు వాళ్ల కొడుకు ఓహ్ జాంగ్ క్యూన్ వయసు 65 ఏళ్లు. వారిద్దరూ ఎన్నాళ్ల కిందటో తమతో వీడిపోయి సరిహద్దులకు ఆవల ఉండిపోయిన లీ సూన్ను కలిసేందుకు వచ్చారు. వారిని చూడగానే మొదట బలహీనంగా నవ్విన లీసూన్ తన పక్కన వచ్చి కూర్చోమని చెప్పాడు. ఇటు భార్య, అటు కొడుకు మధ్య కూర్చున్న లీ సూన్. దాదాపు పళ్లన్నీ ఊడిపోయి.. హియరింగ్ మెషీన్తో కష్టంగా వింటూ ఏవో కొన్ని మాటలు మాట్లాడాడు. రెండు కొరియాలను వేరుచేసే సరిహద్దు రేఖకు సమీపంలో ఉన్న కుంగ్యాంగ్ మౌంటైన్ రిసార్ట్లో వీరు కాసేపు కలుసుకున్నారు.
వీరి చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఇలాంటిదే. అకస్మాత్తుగా వచ్చిపడిన యుద్ధంతో సరిహద్దుకు అటువైపు, ఇటువైపు ఉండిపోయి.. తిరిగి తమవారిని కలుసుకోలేకపోయిన ఆవేదనాభరితులే అక్కడ ఉన్నవాళ్లంతా. సరిహద్దుకు కేవలం అటు-ఇటు కొన్ని మైళ్ల దూరంలోనే ఉన్నా.. ఇరుదేశాల మధ్య ఉన్న ద్వేషం వల్ల దశాబ్దాల పాటు తమవారికి దూరమయ్యారు. కొరియాల విభజన కారణంగా తమవారికి దూరంగా చెల్లాచెదురుగా ఉన్న 96 కుటుంబాలు ఈ కార్యక్రమంతో ఒకేచోట కలుసుకున్నారు. తమవారిని చూసి ఆనందబాష్పాలు రాల్చారు. వీరిలో అత్యంత వృద్ధుడు కూ సాంగ్ యూన్ (98). ఆయన వీడిపోయే ముందు తన కూతుళ్లకు బూట్లు కొనిస్తానని మాటిచ్చాడు. ఆ మాటను గుండెల్లో దాచుకొని.. ఇన్నాళ్లకు తనను మళ్లీ కలిసిన ఇద్దరు కూతుళ్లకు కొత్త బూట్లను కానుకగా ఇచ్చాడు. 71, 68 ఏళ్ల వయసున్న సుంగ్-జా, సున్-ఒక్ తమ తండ్రిని ఆప్యాయంగా హత్తుకొని ఆ కానుకను అందుకున్నారు. కొరియాల విభజన కారణంగా మొత్తం 66 వేల మంది సరిహద్దుకు రెండు వైపులా ఉండిపోయి తమవారికి దూరమయ్యారు. అందులో 96 కుటుంబాలు మంగళవారం ఒకటయ్యాయి.