South Koreans
-
ఆ.. వీడియో అనుకుని డౌన్లోడ్ చేస్తే దయ్యాలు కనిపించాయ్!
-
ఆ.. వీడియో అనుకుని డౌన్లోడ్ చేస్తే దయ్యాలు కనిపించాయ్!
స్మార్ట్‌ఫోన్‌తో యావత్ ప్రపంచాన్నీ అందుబాటులోకి తెచ్చుకున్నామని ఒకవైపు మనం సంబర పడుతుంటే.. దాని దుష్ప్రభావాలూ చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం అరచేతిలో అశ్లీల చిత్రాలు చూస్తున్నారు. అయితే దక్షిణ కొరియాలో పోర్నోగ్రఫి పెద్ద సమస్యగా మారింది. రహస్యంగా అమర్చిన కెమేరాల కారణంగా ప్రతి ఏడాది వేల కొద్ది లైంగిక నేరాలు జరుగుతున్నాయి. ఇలా రహస్యంగా చిత్రీకరించిన దృశ్యాల కోసం ఆన్లైన్లో వెతికేవారు ఎక్కువ అవుతున్నారు. అలాంటి వారికి ఇప్పుడు దక్షిణ కొరియా పోలీసులు ఊహించని షాక్ ఇస్తున్నారు. దక్షిణ కొరియా పోలీసులు 'షాక్ థెరపీ' పేరుతో సీక్రెట్ కెమెరా శృంగార వీడియోలను తయారు చేసింది. వీటిని ఫైల్ షేరింగ్ వెబ్సైట్లలో అప్లోడ్ చేశారు. వీటిని పోర్న్ వీడియోలుగా భావించి గత నెల 17 నుంచి 31లోపు దాదాపు 30 వేల మంది ఓ వీడియోను డౌన్లోడ్ చేసుకున్నారట. ‘ ఆమె ఆత్యహత్య చేసుకోవడానికి మీరు కారణం కావొచ్చు’ లాంటి హెచ్చరికలు ఇందులో కనిపిస్తున్నాయి. ఈ షాక్ థెరపీతో పోర్న్ దృశ్యాలు చూసేవారిని నియంత్రించొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సీక్రెట్ కెమేరాలతో వీడియోలు చిత్రీకరించేవారు దొరికితే అయిదేళ్ల జైలు శిక్ష ఖాయం అంటున్నారు. -
900మంది గుండ్లు గీయించుకొని పోరాటం
సియోల్: తమ దేశం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దక్షిణ కొరియా ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. దాదాపు 900 మంది బహిరంగంగా గుండ్లు చేయించుకొని నిరసన తెలిపారు. తమ భద్రతకు సంబంధించిన ఎలాంటి హామీ ఇవ్వకుండానే అనుచిత నిర్ణయాన్ని తీసుకోవడం తాము ఏ మాత్రం అంగీకరించబోమంటూ వారంతా రోడ్లెక్కారు. అమెరికాతో అణు కార్యక్రమంలో భాగంగా దక్షిణ కొరియా ఆ దేశంతో థాడ్(యూఎస్ టెర్మినల్ హైట్ ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్) ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం సియాంజులో ఓ భారీ యాంటీ మిసైల్ యూనిట్ ను ఏర్పాటుచేయనుంది. దీనికి వ్యతిరేకంగా సియాంజు నగర ప్రజలు తమ దేశ స్వేచ్ఛా దినం రోజే రోడ్లెక్కి ఈ నిరసన తెలిపారు. గత జనవరిలో నాలుగోసారి ఉత్తరకొరియా అణు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రతిసారి ఏదో ఒక అణ్వాయుధాల పరీక్షలు జరుపుతూ తాము అమెరికాలోని ఏ భాగంనైనా.. దక్షిణ కొరియా రాజధానినైనా క్షణాల్లో బుగ్గి చేయగలమంటూ ప్రకటనలు చేస్తూ ప్రతి క్షణం భయపెడుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా అమెరికాతో యాంటి మిసైల్ ప్రోగ్రాంకు సంబంధించి ఒప్పందం చేసుకుంది. వాస్తవానికి సియాంజు వ్యవసాయానికి అనువైన భూభాగం. ఇక్కడ ఎంతోమంది రైతులు పలు రకాల పంటలు పండించి దేశంలోని పలు ప్రాంతాల అవసరాలు తీరుస్తున్నారు. ఇప్పుడు అక్కడ యాంటీ మిసైల్ యూనిట్ ఏర్పాటుచేస్తే అదంతా దెబ్బతినే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నో థాడ్.. నో థాడ్ అంటూ వారంతా నిరసన నినాదాలు చేశారు. ఒక్క సియాంజులేకాకుండా దేశంలో ఎక్కడా అలాంటి విభాగాన్ని ప్రారంభించడానికి వీల్లేదంటూ వారు మండిపడ్డారు. -
65 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ!
దాదాపు 65 ఏళ్లు.. ఒకరినొకరు చూసుకొని, ఒకరితో ఒకరు మాట్లాడుకొని..! ఇన్నాళ్లు వేచి చూస్తూ.. ఎలాగోలా కాలం గడిపిన ఆ వృద్ధ దంపతులు కలుసుకునే క్షణం రానేవచ్చింది. ఓ క్షణం ఉత్కంఠ, ఓ క్షణం ఉద్విగ్నత. ఎలా మాట్లాడుకోవాలో, ఏమని పలుకరించుకోవాలో తెలియని సందిగ్ధత.. చూసుకోవడంతోనే వారి హృదయాలు ఉప్పొంగాయి. కన్నీళ్లు వాటంతటవే ఉబికాయి.. ఇది లీ సూన్-గ్యూ-ఓహ్ ఇన్ సే దంపతుల అనుభవం. ఇరు కొరియాల మధ్య యుద్ధం రాజుకోవడంతో 1950, సెప్టెంబర్‌లో పెళ్లయిన కొన్నాళ్లకే విడిపోయిన వాళ్లు.. ఆరున్నర దశాబ్దాలు వేచివేచి.. ఆఖరికి కలుసుకోగలిగారు. కొరియాల యుద్ధం వల్ల వేరైన కుటుంబాల కలయిక కార్యక్రమం సందర్భంగా మంగళవారం వీరి అపూర్వ పునఃసంగమం సాధ్యపడింది. లీ సూన్ భార్యతో వేరయ్యే నాటికి 19 ఏళ్ల ఆమె ఆరు నెలల గర్భవతి. ఇప్పుడు వాళ్ల కొడుకు ఓహ్ జాంగ్ క్యూన్ వయసు 65 ఏళ్లు. వారిద్దరూ ఎన్నాళ్ల కిందటో తమతో వీడిపోయి సరిహద్దులకు ఆవల ఉండిపోయిన లీ సూన్ను కలిసేందుకు వచ్చారు. వారిని చూడగానే మొదట బలహీనంగా నవ్విన లీసూన్ తన పక్కన వచ్చి కూర్చోమని చెప్పాడు. ఇటు భార్య, అటు కొడుకు మధ్య కూర్చున్న లీ సూన్. దాదాపు పళ్లన్నీ ఊడిపోయి.. హియరింగ్ మెషీన్‌తో కష్టంగా వింటూ ఏవో కొన్ని మాటలు మాట్లాడాడు. రెండు కొరియాలను వేరుచేసే సరిహద్దు రేఖకు సమీపంలో ఉన్న కుంగ్యాంగ్ మౌంటైన్ రిసార్ట్‌లో వీరు కాసేపు కలుసుకున్నారు. వీరి చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఇలాంటిదే. అకస్మాత్తుగా వచ్చిపడిన యుద్ధంతో సరిహద్దుకు అటువైపు, ఇటువైపు ఉండిపోయి.. తిరిగి తమవారిని కలుసుకోలేకపోయిన ఆవేదనాభరితులే అక్కడ ఉన్నవాళ్లంతా. సరిహద్దుకు కేవలం అటు-ఇటు కొన్ని మైళ్ల దూరంలోనే ఉన్నా.. ఇరుదేశాల మధ్య ఉన్న ద్వేషం వల్ల దశాబ్దాల పాటు తమవారికి దూరమయ్యారు. కొరియాల విభజన కారణంగా తమవారికి దూరంగా చెల్లాచెదురుగా ఉన్న 96 కుటుంబాలు ఈ కార్యక్రమంతో ఒకేచోట కలుసుకున్నారు. తమవారిని చూసి ఆనందబాష్పాలు రాల్చారు. వీరిలో అత్యంత వృద్ధుడు కూ సాంగ్ యూన్ (98). ఆయన వీడిపోయే ముందు తన కూతుళ్లకు బూట్లు కొనిస్తానని మాటిచ్చాడు. ఆ మాటను గుండెల్లో దాచుకొని.. ఇన్నాళ్లకు తనను మళ్లీ కలిసిన ఇద్దరు కూతుళ్లకు కొత్త బూట్లను కానుకగా ఇచ్చాడు. 71, 68 ఏళ్ల వయసున్న సుంగ్-జా, సున్-ఒక్ తమ తండ్రిని ఆప్యాయంగా హత్తుకొని ఆ కానుకను అందుకున్నారు. కొరియాల విభజన కారణంగా మొత్తం 66 వేల మంది సరిహద్దుకు రెండు వైపులా ఉండిపోయి తమవారికి దూరమయ్యారు. అందులో 96 కుటుంబాలు మంగళవారం ఒకటయ్యాయి.