
తెలంగాణ దెబ్బకు చంద్రబాబు మకాం మార్చిండు
తెలంగాణ అభివృద్ధిపై దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీలు ఒక్కరోజులో అభివృద్ధి చేసేందుకు ఏమైనా అద్భుతదీపాన్ని ఇచ్చాయా?
- టీడీపీలో ఉన్న నేతలంతా ఉనికి కోసమే విమర్శలు
- మంత్రి కె. తారకరామారావు ఎద్దేవా
సాక్షి, పెద్దపల్లి: తెలంగాణ దెబ్బకు టీడీపీ అధినేత చంద్రబాబు, చిన్నబాబు తట్టా బుట్టా సర్దుకుని అమరావతికి మకాం మార్చిండని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి నగర పంచాయతీ అభివృద్ధికి రూ.50కోట్లు ప్రకటించారు. అనంతరం పెద్దపల్లి, మంథని, రామగుండంలో జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
తెలంగాణలో మిగిలిపోయిన చోటామోటా టీడీపీ నేతలంతా ఉనికి కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్న కేటీఆర్..భవిష్యత్ టీఆర్‌ఎస్‌దేనని, టీడీపీలో మిగిలిపోయినవారు ఆ పార్టీని విడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని గురించి మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మాగాంధీ ఆనాడే చెప్పాని, ఆ పార్టీ నాయకులు చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు జలాలు అందించేందుకు సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేపడితే కాంగ్రెస్ నాయకులు చచ్చిపోయిన వారి సంతకాలతో కోరున్టు ఆశ్రయించారని ఆరోపించారు. రాష్టాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు 65ఏళ్లలో వదిలిన దరిద్రాన్ని, గబ్బును కడిగేందుకే మూడేళ్లు సరిపోయిందన్నారు.
'తెలంగాణ అభివృద్ధిపై దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీలు ఒక్కరోజులో అభివృద్ధి చేసేందుకు ఏమైనా అద్భుతదీపాన్ని ఇచ్చాయా?' అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ఆనాడు ఆంధ్రా నాయకుల మోచేతి నీళ్లు తాగకుండా పనిచేసుంటే తెలంగాణకు ఈ రోజు ఈ గతి పట్టి ఉండేది కాదని జానారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ పార్టీ దేశంలోనే అత్యంత బలమైన రాజకీయ పార్టీగా అవతరించిదని చెప్పారు. కాంగ్రెస్ అంటే గతం, టీఆర్‌ఎస్ అంటే భవిష్యత్ అన్నారు. కేటీఆర్ పర్యటనలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధు, రామగుండం మున్సిపల్ చైర్మన్ కొంకటి లక్ష్మీనారాయణ, నగర పంచాయతీ చైర్మన్ ఎలువాక రాజయ్య తదితరులు పాల్గొన్నారు.