
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓటుకు కోట్లు’కేసులో జెరూసలేం మత్తయ్య పేరును తొలగించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసిన పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. పోలీసు రక్షణ కోరుతూ తెలంగాణ డీజీపీకి మత్తయ్య దరఖాస్తు చేసుకుంటారని, దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు బృందం కోట్ల రూపాయలు లంచం ఇవ్వజూపిన కేసులో నిందితుల పేర్ల నుంచి మత్తయ్యను హైకోర్టు తొలగించడాన్ని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 2016లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని మత్తయ్యను ఆదేశిస్తూ 2017 జనవరి 16న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. తొలుత మత్తయ్య తరఫున తాను వకాల్తా పుచ్చుకున్నానని, 2 వారాల సమయం కావాలని న్యాయవాది సుప్రియ నివేదించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున హరీన్ పి.రావల్ వాదనలు వినిపిస్తూ అనేక కారణాలతో తరచూ వాయిదా అడుగుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తదుపరి తాను తప్పనిసరిగా కౌంటర్ దాఖలు చేయడంతోపాటు వాదనలు వినిపిస్తానని న్యాయవాది నివేదించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
నన్ను పోలీసులు అడ్డుకున్నారు
విచారణ ముగిసిన కొద్దిసేపటికి మత్తయ్య కోర్టులోకి వచ్చారు. తనను కోర్టులోకి రానివ్వకుండా ఏపీ పోలీసులు అడ్డుకున్నారని, తన గుర్తింపు కార్డు లాక్కున్నారని, అందుకే లోనికి తొందరగా రాలేకపోయానని, తన కేసులో ఎవరినీ న్యాయవాదిగా పెట్టలేదని, తానే వాదిస్తానని కోరారు. ‘నాకు న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేదు. ఈ కేసులో నా పాత్ర లేదు. దానిపై నేనే స్వయంగా వాదనలు వినిపించుకుంటానని న్యాయస్థానానికి విన్నవించుకున్నాను’అని తెలుగులో నివేదించారు. అంతకుముందు మత్తయ్య తరపున హాజరైన న్యాయవాదిని జస్టిస్ లావు నాగేశ్వరరావు ప్రశ్నించగా పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వ అడ్వొకేట్ ఆన్ రికార్డ్ గుంటూరు ప్రభాకర్ ‘ఇదిగోండి.. నిన్న తానే నా చాంబర్‌కు వచ్చి మత్తయ్య సంతకం చేసి ఇచ్చిన కాగితం. నన్నే వాదించమన్నారు’అంటూ నివేదించారు. ‘నేను ఎవరినీ కలవలేదు. నేను అడ్వొకేట్‌ను పెట్టుకునే అవకాశం ఉంటే నేనే పార్టీ ఇన్ పర్సన్‌గా ఎలా వాదించుకుంటానని దరఖాస్తు పెట్టుకుంటాను’అని మత్తయ్య వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ముందుగా వచ్చిన న్యాయవాది వకాల్తాను ధర్మాసనం రద్దు చేసింది.
నాకు రక్షణ లేదు..
తాను వాదనలు వినిపించేందుకు కోర్టులోకి వస్తుంటే ఏపీ పోలీసులు అడ్డుకున్నారని, తనకు రక్షణ కావాలని, హైదరాబాద్‌లో కూడా రక్షణ లేదని కోర్టుకు విన్నవించారు. అయితే ఇక్కడ పోలీసులు ఎందుకు ఉంటారని ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయవాది హరీన్ రావల్ మాట్లాడుతూ.. ‘ఏపీ పోలీసులు అడ్డుకున్నారని మత్తయ్య చెబుతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది. దీనిపై విచారణకు ఆదేశించండి. న్యాయస్థానానికి రాకుండా ఆపడం ఎంతవరకు సమంజసం’అని పేర్కొన్నారు.
నాతో ఫిర్యాదు చేయించినవారెవరో చెబుతా: మత్తయ్య
విచారణ అనంతరం మత్తయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజకీయ ఎత్తుగడలకు నేను బలయ్యాను. కొన్ని ప్రభుత్వాలు, కొన్ని పార్టీలు వాడుకున్నాయి. ఒక పార్టీలో ఉన్న క్రైస్తవ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ఇంకో పార్టీలోని క్రైస్తవులను బలి పశువులుగా చేసేందుకు కుట్ర చేశారు. మమ్మల్ని పావులుగా వాడుకుంటున్న టీడీపీ పార్టీ గానీ, టీఆర్‌ఎస్‌లోని క్రైస్తవులకు గుర్తింపు లేకుండా పోయింది. ఇద్దరు చేసిన తప్పులను, రాజకీయ పార్టీల కుట్రలను ధర్మాసనం ముందు చెబుతా. ఇప్పటికీ నా వెంట పోలీసులు ఫాలో అవుతున్నారు’అని వివరించారు. ‘నాపై తప్పుడు ఆరోపణలు పెట్టారు. ఓటుకు కోట్లు కేసులో డబ్బులు ఇచ్చింది ఒక పార్టీ.. తీసుకున్నది మరో పార్టీ.. నాపై ఎందుకు కేసు పెట్టారు. ఎవరు నా పేరు పెట్టాలని ఒత్తిడి చేశారు? టీఆర్‌ఎస్ ప్రభుత్వం మీద ఎవరు నాతో ఫిర్యాదు చేయించారు.. అన్నీ న్యాయస్థానానికి చెబుతా’అని వివరించారు.
చర్యలు తీవ్రంగా ఉంటాయి: ధర్మాసనం
కోర్టుకు రాకుండా అడ్డుకోవడంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే జోక్యం చేసుకుంటూ ‘మీ రాజకీయాలు ఏమున్నాయో మాకు తెలియదు. కానీ పోలీసులు ఇలా సుప్రీంకోర్టుకు రాకుండా అడ్డుకోవడం చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఎవరైనా నిరోధించినట్లు తేలితే తీవ్రమైన చర్యలు తీసుకుంటాం’అని పేర్కొన్నారు. మత్తయ్యకు తెలంగాణ ప్రభుత్వం రక్షణ కల్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను నవంబర్ 22కు వాయిదావేసింది.
Comments
Please login to add a commentAdd a comment