
ఈ ప్రమాదాలకు బాధ్యులు ఎవరు?
Published Mon, Jan 23 2017 8:01 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM

మూణ్ణెళ్లుగా దేశంలో వరుసగా జరగుతున్న రైలు ప్రమాదాల్లో 200మందికి పైగా అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. వందల మంది గాయాలపాలయ్యారు. ప్రమాదాలు జరుగుతున్న తీరు విచారణ సంస్ధలకు లభిస్తున్న క్లూలు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. రైలు ప్రమాదాల కేసులను టేకప్ చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్‌ఐఏ)కు పలు కీలక ఆధారాలు లభించాయి.
తూర్పు చంపారన్ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనాస్ధలిలో ఓ పేలని ఇంప్రూవైజ్‌డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ) పోలీసులకు లభ్యమైంది. అంతేకాకుండా నేపాల్ లో గత ఏడాది జరిగిన రెండు హత్యలకు, భారత్‌లో జరుగుతున్న రైలు ప్రమాదాలకు సంబంధం ఉందని ఎన్‌ఐఏ వద్ద ఉన్న ఆధారాలు సూచిస్తున్నాయి. ప్రమాదానికి కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న నిందితులు విచారణలో పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఈ రైలు ప్రమాదాలకు వ్యూహం రచించినట్లు చెప్పారు.
నిందితులు అందించిన సమాచారంతో కూపీ లాగిన అధికారులకు నేపాల్, కరాచీల్లో ఉంటున్న ఇద్దరు వ్యక్తులు రైళ్ల ప్రమాదాలకు పెద్ద ఎత్తున నగదును అందించినట్లు బయటపడింది. రైలు పట్టాలపై పేలని ఐఈడీని కనిపెట్టిన బీహార్ పోలీసులు బాంబును అమర్చిన అనుమానితులు మోతీ పాశ్వన్, ఉమాశంకర్ యాదవ్, ముకేశ్ యాదవ్ లను అరెస్టు చేశారు. ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించాలని నేపాల్‌లో బ్రిజ్ కిషోర్ గిరి అనే వ్యక్తి కుట్ర పన్నినట్లు విచారణలో వారు చెప్పారు.
ఈ సమాచారంతో నేపాల్ వెళ్లిన పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే, ఐఈడీ పేలుడు సఫలీకృతం కానందుకు వాటిని అమర్చిన దీపక్ రామ్, రాక్సావుల్‌లను నేపాల్‌కు పిలిపించి గొంతు కోసి చంపినట్లు ఎన్‌ఏఐ అధికారి ఒకరు చెప్పారు. ఇరువురి మృతదేహాలు ఓ కారులో లభ్యమైనట్లు పేర్కొన్నారు. మృత దేహాలు లభ్యమైన కారు బ్రిజ్‌కు చెందిందని తెలిసింది. బ్రిజ్‌తో కలిసి బోర్డర్లో స్మగ్లింగ్ చేసే శంశుల్ హుడా కూడా ఈ హత్యల్లో పాలు పంచుకున్నట్లు తెలిసింది.
ఈ విషయంపై నేపాల్ పోలీసులు హుడాను ప్రశ్నించగా తాను దుబాయ్ కు చెందిన బిజినెస్‌మ్యాన్‌గా అతను పేర్కొన్నాడు. కాల్ రికార్డుల ఆధారంగా హుడా తరచూ కరాచీకి చెందిన అండర్‌వరల్డ్ డాన్ షఫీతో తరచూ సంభాషిస్తున్నట్లు తెలిసింది. కాగా, గత కొద్ది సంవత్సరాలుగా షఫీ కార్యకలాపాలపై ఎన్‌ఐఏ నిఘా పెట్టి ఉంచింది. షఫీపై భారత్‌లో నకిలీ కరెన్సీ తయారుచేసినట్లు కేసులు ఉన్నాయి. పేలుడు పదార్ధాలను కూడా షఫీ భారత్‌కు సరఫరా చేస్తున్నట్లు కూడా రిపోర్టులు వచ్చాయి.
దీంతో హుడాను పట్టుకునేందుకు యత్నించిన అధికారులకు ఆశ్చర్యకరమైన సంఘటన ఎదురైంది. హుడా కోసం ఓ ట్రావెల్ ఏజెన్సీని పోలీసులు సంప్రదించగా అది అతని మేనల్లుడు జియా నడుపుతున్నట్లు తెలిసింది. జియా భారత పాస్‌పోర్టును కూడా కలిగివున్నట్లు అధికారులు గుర్తించారు. పలువురికి భారత పాస్‌పోర్టులు అందించిన జియాకు డాక్యుమెంట్లను ఎవరు అందించారనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది.
అండర్‌వరల్డ్ సహాకారంతో భారత్‌లోకి పేలుడు పదార్ధాలు, నకిలీ నోట్లు సరఫరా చేయడం కొత్తేం కాదు. గతంలో నేపాల్ కూడా భారత్‌పై ఉగ్రదాడులకు పాల్పడింది. కానీ, తాజాగా జరుగుతున్న రైలు ప్రమాద ఘటనల్లో భారత యువతే ఉంటోంది. ఈ విషయం భద్రతా సంస్ధలకు కలవరపాటుకు గురి చేస్తోంది. ఎంత స్ధాయిలో స్ధానిక యువత అండర్‌వరల్డ్‌కు ఉపయోగపడుతోందో సరైన అవగాహన నిఘా సంస్ధలకు ఇంకా లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పారు.
Advertisement
Advertisement