శోభన్ సర్కార్కు ప్రమాణం చేస్తున్నా: మోడీ
ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నబంగారం వేట గురించి నిన్న గాక మొన్న విమర్శలు గుప్పించిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తాజాగా మాట మార్చారు. కోట కింద బంగారం ఉందని చెప్పిన సాధువు శోభన్ సర్కార్ను పొగడ్తలతో ముంచెత్తారు. ''అనేక సంవత్సరాలుగా లక్షలాది మంది ప్రజలు సంత్ శోభన్ సర్కార్ పట్ల విశ్వాసంతో ఉన్నారు. ఆయన శ్రద్ధ, త్యాగాలకు నేను ప్రమాణం చేస్తున్నాను'' అని మోడీ ట్విట్టర్లో రాశారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం గురించి మరోసారి ప్రస్తావించిన మోడీ.. ఆ అంశంపై కేంద్రం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై దేశ ప్రజలకు విశ్వాసం కలిగించాలని కోరారు.
శోభన్ సర్కార్ భక్తులు కొందరు మోడీకి లేఖ రాసి.. ఆయనపై చేసిన వ్యాఖ్యాలకు నిరసన వ్యక్తం చేయడం వల్లే మోడీ ఇలా మాట మార్చారని భావిస్తున్నారు. ప్రపంచమంతా మనల్ని చూసి నవ్వుతోందంటూ.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తవ్వకాల గురించి చెన్నైలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మోడీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దేశాన్ని దోచుకున్న వారి చేతుల్లో ఉన్న సొమ్ము వెయ్యి టన్నుల బంగారం కంటే ఎక్కువే ఉంటుందని వ్యాఖ్యానించారు.