'అగ్రిగోల్డ్' బాధితులకు రెండు నెలల్లో నగదు!
హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసు విచారణ సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి గురువారం వెల్లడించారు. అయితే సోమవారం అగ్రిగోల్డ్ ఛైర్మన్ స్వయంగా ఈ విచారణకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. రెండు నెలల్లో బాధితులందిరికి డబ్బులు చెల్లించాలని తెలిపారు . అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులందరికీ డబ్బు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం తెలిపింది.
కాగా అగ్రిగోల్డ్ కేసు విచారణ సోమవారంతో ముగుస్తుందని బాధితులు భావిస్తున్నారు. మరో రెండు నెలల్లో బాధితులకు నగదు అందజేసేలా చర్యలు తీసుకోవలంటూ న్యాయమూర్తి తెలిపిన నేపథ్యంలో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు నెలలుగా ఈ కేసు విచారణ సాగుతుందని... సాధ్యమైనంత త్వరగా ఈ విచారణ ముగించాలని బాధితుల తరపు న్యాయవాది హైకోర్టుకి విజ్ఞప్తి చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి పైవిధంగా స్పందించారు. దాదాపు 40 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఈరోజు హైకోర్టు చేసిన వ్యాఖ్యాలతో ఊరట లభించింది.