ముంబై కార్పొరేషన్‌లో ఒవైసీ బోణీ
ప్రతిష్ఠాత్మకమైన బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ బోణీ కొట్టింది. తొలిసారి ఆ కార్పొరేషన్‌లోని మూడు స్థానాల్లో గెలిచింది. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ పార్టీ ఇప్పటివరకు కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం అయ్యిందని అనుకున్నా.. ఇప్పుడు ముంబైలోనూ అడుగుపెట్టింది.
మొత్తం 227 వార్డులున్న బీఎంసీలో మొత్తం 59 చోట్ల పోటీ చేసిన ఎంఐఎం.. చీతా క్యాంప్, బైకుల్లా వార్డులలో గెలిచింది. అయితే మజ్లిస్ పార్టీ కనీసం 6 నుంచి 8 స్థానాల వరకు గెలుచుకోవచ్చని చాలామంది ఊహించారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఔరంగాబాద్, బైకుల్లా స్థానాలలో గెలిచింది. ఇప్పుడు ముంబై కార్పొరేషన్‌లో కూడా అడుగుపెట్టడంతో ఒవైసీ కల కొంతవరకు నెరవేరినట్లయింది.