సముద్రంలో 92 మృతదేహలు... గాలింపు నిలిపివేత
జకార్తా: జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియా విమాన శకలాలు, మృతదేహల అన్వేషణను నిలివేస్తున్నట్లు ఇండొనేసియా మిలటరీ ఉన్నతాధికారులు ప్రకటించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పాటు.... మృతదేహల కోసం అలుపెరగకుండా అన్వేషణ చేయడంతో విమానం అన్వేషణ బృందంలోని సభ్యులు తీవ్ర అనార్యోగానికి గురైయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిలటరీ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇప్పటి వరకు జావా సముద్రం నుంచి 70 మృతదేహలను వెలికితీయగా... మరో 92 మృతదేహలు బయటకు తీయవలసి ఉందని చెప్పారు. అలాగే ఎయిర్ ఏషియా విమానానికి చెందిన బ్లాక్ బాక్స్తోపాటు పలు శకలాలను అన్వేషణ బృందాలు వెలికి తీసిన సంగతిని మిలటరీ ఉన్నతాధికారి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గతేడాది డిసెంబర్ 28వ తేదీన విమాన ప్రయాణికులు, సిబ్బందితో సహా162 మందితో ఎయిర్ ఏషియా విమానం ఇండోనేసియాలోని రెండో అతిపెద్ద నగరం సురబయ నుంచి సింగపూర్ బయలుదేరింది. ఆ క్రమంలో కొద్ది సేపటికే విమానం ఇండోనేసియా విమానాశ్రయ అధికారులతో సంబంధాలు తెగిపోయాయి. దాంతో విమాన ఆచూకీ కోసం ఇండోసియా ఉన్నతాధికారులు రంగంలోకి దిగి అన్వేషణ ప్రారంభించారు. దాంతో ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కుప్పకూలి 162 మంది ప్రయాణికులు జల సమాధి అయినట్లు గుర్తించారు. నాటి నుంచి విమాన శకలాలు, మృతదేహల కోసం అన్వేషణ సాగుతున్న విషయం తెలిసిందే.