విమానకంపెనీలు గూండాల్లా ప్రవర్తిస్తున్నాయ్!
ఉగ్రవాదులకు అనుమతిచ్చి.. సామాన్యులకు తిరస్కారామా?
న్యూఢిల్లీ: విమానాయాన కంపెనీలు గూండాల్లా వ్యవహరిస్తున్నాయంటూ శివసేన తీవ్రంగా విరుచుకుపడింది. ఉగ్రవాదులను తమ విమానాల్లో ఎక్కించుకోవడానికి అనుమతిస్తున్న ఎయిర్‌లైన్ కంపెనీలు.. సామాన్యులపై మాత్రం ఆంక్షలు విధిస్తున్నాయని మండిపడింది. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై విధించిన నిషేధం విషయంలో దేశీయ విమానాయాన సంస్థలు ఏమాత్రం వెనుకకు తగ్గని నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీలు గురువారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి ఈ అంశంపై చర్చించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా శివసేన ఎంపీలు విమానాయాన సంస్థల తీరుపై దుమ్మెత్తిపోశారు. ఎంపీలతో తప్పుగా ప్రవర్తించినందుకు మొదట ఎయిరిండియానే క్షమాపణ చెప్పాలని అన్నారు.
'గైక్వాడ్ చేసిన తప్పేమిటి? ఎయిర్‌లైన్ కంపెనీల ప్రవర్తన మాఫియా, గూండాలను తలపిస్తున్నది. మీ కంపెనీల పరిధిలో ఏమైనా జరిగితే చూడాల్సిన బాధ్యత మీకు లేదా? మేం ఇప్పుడు లోక్‌సభ స్పీకర్‌ను కలువబోతున్నాం. అందుకే ఎక్కువ మాట్లాడటం లేదు' అని శివసేన నేత సంజయ్ రావత్ పేర్కొన్నారు.
గత గురువారం పుణె-న్యూఢిల్లీ విమానంలో తనకు బిజినెస్ క్లాస్‌ను నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన శివసేన ఎంపీ గైక్వాడ్ ఎయిరిండియా మేనేజర్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. అతడిని గైక్వాడ్ 25సార్లు చెప్పుతో కొట్టాడు. ఎంపీ దుష్ర్రవర్తన ఎయిరిండియాను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో గైక్వాడ్‌పై ఎయిరిండియా సహా ఐదు ప్రైవేటు విమానాయాన సంస్థలు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే.