పోస్ట్ పెయిడ్ మొబైల్ రేట్లను పెంచిన ఎయిర్‌టెల్
పోస్ట్ పెయిడ్ మొబైల్ రేట్లను పెంచిన ఎయిర్‌టెల్
Published Tue, Sep 3 2013 1:50 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ కొన్ని పోస్ట్ పెయిడ్ మొబైల్ రేట్లను 50 శాతం వరకూ పెంచింది. పెంచిన ఈ రేట్లు ఈ నెల 8 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ తన వినియోగదారులకు పంపించిన మెసేజ్‌ల్లో పేర్కొంది. అడ్వాండేజ్ 199 ప్లాన్ రేట్లను పెంచామని ఈ మేసేజ్‌లో కంపెనీ వివరించింది. అడ్వాండేజ్ 199 ప్లాన్‌కు సంబంధించి ఎయిర్‌టెల్ నంబర్లకు చేసే లోకల్, ఎస్‌టీడీ రేట్లను నిమిషానికి 50 పైసల నుంచి 60 పైసలకు పెంచామని పేర్కొంది.
ఇక ల్యాండ్‌లైన్ కాల్స్‌కు సంబంధించి రేటు నిమిషానికి 60 పైసల నుంచి 90 పైసలకు పెరుగుతుందని. ఇతర కీలకమైన టారిఫ్‌ల్లో ఎలాంటి మార్పులు లేవని వివరించింది. కాగా రెండేళ్లలో మొబైల్ కాల్ రేట్లు వంద శాతానికి పైగా పెరిగాయి. గత ఏడాది సుప్రీం కోర్టు 2జీ లెసైన్స్‌లను రద్దు చేసిన తర్వాత కొన్ని మొబైల్ కంపెనీలు రంగం నుంచి వైదొలిగాయి. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న మొబైల్ కంపెనీలు తరుచుగా టారిఫ్‌లను పెంచుతున్నాయి.
Advertisement