ఎయిర్‌టెల్, ఐడియా అంతర్జాతీయ కాల్ రేట్ల పెంపు
న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజాలు ఎయిర్‌టెల్, ఐడియాలు అంతర్జాతీయ కాల్ రేట్లను పెంచాయి. రూపాయి పతనం ప్రభావం కారణంగా రేట్లను పెంచాల్సి వచ్చిందని ఆ కంపెనీలు పేర్కొన్నాయి. ఎయిర్‌టెల్ 80 శాతం, ఐడియా 25 శాతం వరకూ ధరలను పెంచాయి. ఈ రెండు కంపెనీల వెబ్‌సైట్ల ప్రకారం, అమెరికా, ఇంగ్లాండ్, కెనడాలకు స్టాండర్డ్ కాల్ రేట్లు నిమిషానికి రూ.6.40 నుంచి రూ.8కు పెరిగాయి. పలు దేశాలకు నిమిషానికి రూ.10గా ఉన్న కాల్ రేట్లు రూ.12కు, రూ. 15గా ఉన్న రేట్లు రూ.17-20కు, రూ.50 నుంచి రూ.60కు, రూ.100 నుంచి రూ.120కు పెరిగాయి.
ఆస్ట్రేలియాకు 6113, 6114లతో మొదలయ్యే నంబర్లతో చేసే ఇంటర్నేషనల్ కాల్ రేట్లను నిమిషానికి రూ.100 నుంచి రూ.180కు పెంచామని ఎయిర్‌టెల్ పేర్కొంది. డాలర్ బలపడటంతో ఐఎస్‌డీ సెగ్మెంట్లో తమపై భారీగానే భారం పడిందని, ఇప్పటివరకూ భరించగలిగామని ఎయిర్‌టెల్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇటీవల కాలంలో రూపాయి మారకంలో తీవ్రమై ఒడిదుడుకులు చోటు చేసుకోవడంతో ధరలు పెంచక తప్పలేదని పేర్కొన్నారు. ఈ పెరుగుదల ఈ నెల 10 నుంచే అమల్లోకి వచ్చిందని తెలిపారు. జర్మనీ కాల్ రేట్ల విషయంలో కొన్ని నిర్దిష్టమైన కోడ్‌లకు పాత ధరలనే కొనసాగిస్తున్నామని వివరించారు. జర్మనీలోని కొన్ని ప్రాంతాలకు కాల్ రేట్లలో ఎయిర్‌టెల్ కంటే ఐడియా కాల్ రేట్లు 88% తక్కువగా ఉన్నాయి.