ఎయిర్‌టెల్ ప్లాటినం 3జీ నెట్‌వర్క్..
తొలుత వైజాగ్, విజయవాడలో
కంపెనీ ఏపీ సర్కిల్ సీఈవో వెంకటేశ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ ఎయిర్‌టెల్ ప్లాటినం 3జీ నెట్‌వర్క్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో విజయవాడ, వైజాగ్‌ల్లో ప్రారంభించింది. మెరుగైన కవరేజ్, శబ్ద స్పష్టత, మరింత వేగవంతమైన ఇంటర్నెట్‌కుతోడు కస్టమర్లకు అత్యుత్తమ నెట్‌వర్క్ అనుభూతి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అంతేగాక ఈ టెక్నాలజీతో మొబైల్ బ్యాటరీ జీవిత కాలం పెరుగుతుందని భారతీ ఎయిర్‌టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సీఈవో వెంకటేశ్ విజయ్‌రాఘవన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. కస్టమర్లు ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండానే ఉత్తమ సేవలు పొందవచ్చని వివరించారు.
ఎయిర్‌టెల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ లీప్‌లో భాగంగానే ప్లాటినం 3జీ నెట్‌వర్క్‌ను అందిస్టున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఇతర సర్కిళ్లలోని ప్రధాన పట్టణాల్లో కంపెనీ ఆవిష్కరించిందని చెప్పారు. రూ.60,000 కోట్లతో దేశవ్యాప్తంగా మూడేళ్లలో నెట్‌వర్క్‌ను ఆధునీకరిస్తారు. ఇక హైదరాబాద్‌లో ప్లాటినం 3జీ నెట్‌వర్క్ మార్చిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీ సర్కిల్‌లో టాప్-25 పట్టణాల్లో ఏడాదిలో పరిచయం చేయనున్నారు. దశలవారీగా కస్టమర్ల సంఖ్యనుబట్టి కొత్త టెక్నాలజీని విస్తరిస్తామని వెంకటేశ్ విజయ్‌రాఘవన్ వెల్లడించారు. ప్రస్తుతం సర్కిల్‌లో 1,900 పట్టణాల్లో 3జీ సేవలను అందిస్టున్నట్టు తెలిపారు.