Venkatesh vijayraghavan
-
ఎయిర్టెల్ ప్లాటినం 3జీ నెట్వర్క్..
తొలుత వైజాగ్, విజయవాడలో కంపెనీ ఏపీ సర్కిల్ సీఈవో వెంకటేశ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ ఎయిర్టెల్ ప్లాటినం 3జీ నెట్‌వర్క్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో విజయవాడ, వైజాగ్ల్లో ప్రారంభించింది. మెరుగైన కవరేజ్, శబ్ద స్పష్టత, మరింత వేగవంతమైన ఇంటర్నెట్కుతోడు కస్టమర్లకు అత్యుత్తమ నెట్వర్క్ అనుభూతి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అంతేగాక ఈ టెక్నాలజీతో మొబైల్ బ్యాటరీ జీవిత కాలం పెరుగుతుందని భారతీ ఎయిర్టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సీఈవో వెంకటేశ్ విజయ్‌రాఘవన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. కస్టమర్లు ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండానే ఉత్తమ సేవలు పొందవచ్చని వివరించారు. ఎయిర్టెల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ లీప్లో భాగంగానే ప్లాటినం 3జీ నెట్‌వర్క్‌ను అందిస్టున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఇతర సర్కిళ్లలోని ప్రధాన పట్టణాల్లో కంపెనీ ఆవిష్కరించిందని చెప్పారు. రూ.60,000 కోట్లతో దేశవ్యాప్తంగా మూడేళ్లలో నెట్‌వర్క్‌ను ఆధునీకరిస్తారు. ఇక హైదరాబాద్‌లో ప్లాటినం 3జీ నెట్వర్క్ మార్చిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీ సర్కిల్లో టాప్-25 పట్టణాల్లో ఏడాదిలో పరిచయం చేయనున్నారు. దశలవారీగా కస్టమర్ల సంఖ్యనుబట్టి కొత్త టెక్నాలజీని విస్తరిస్తామని వెంకటేశ్ విజయ్‌రాఘవన్ వెల్లడించారు. ప్రస్తుతం సర్కిల్లో 1,900 పట్టణాల్లో 3జీ సేవలను అందిస్టున్నట్టు తెలిపారు. -
ఇన్వెస్టర్లలో కొండంత విశ్వాసం
న్యూఢిల్లీ: భారత్‌పై పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంచడంలో తమ ప్రభుత్వం విజయవంతమైందని కేంద్ర విద్యుత్, బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. విశ్వాసం ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకుందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్), భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహిస్తున్న భారత్ ఆర్థిక సదస్సులో గురువారం జరిగిన చర్చలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వ్యాపారాలు విజయవంతమైతే... ప్రజల జీవితాలను మేం మెరుగుపరుస్తాం. పేదలు-వ్యాపారవేత్తలిద్దరికీ చేదోడుగా ఉంటామన్న మా ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి వైరుధ్యం లేదు. ఆర్థిక క్రమశిక్షణకు చర్యలతో పాటు పాలనలో పారదర్శకతకు వీలుగా చర్యలు మొదలుపెట్టాం’ అని గోయల్ వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ అధిక వృద్ధి బాటలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. 2019 కల్లా 100 కోట్ల టన్నులకు బొగ్గు ఉత్పత్తి వచ్చే ఐదేళ్లలో(2019 కల్లా) బొగ్గు ఉత్పత్తిని రెట్టింపు చేసి 100 కోట్ల టన్నులకు చేర్చాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని గోయల్ వెల్లడించారు. దేశంలో ఇంధన డిమాండ్‌ను తట్టుకోవాలంటే ఉత్పత్తి పెంపే మార్గమన్నారు. ఈ ఏడాది దేశీయంగా బొగ్గు ఉత్పత్తి సుమారు 50 కోట్ల టన్నులు ఉండొచ్చన్నారు. ఇక బొగ్గు ఉత్పత్తిలో ప్రైవేటు రంగం పాత్రను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా రానున్న 4-5 ఏళ్ల వ్యవధిలో దేశీ ఇంధన రంగంలో 2,500 కోట్ల డాలర్ల మేర భారీ పెట్టుబడి అవకాశాలున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు గోయల్ చెప్పారు. ఇందులో 1,000 కోట్ల డాలర్లు పునరుత్పాదక ఇంధన రంగంలో 500 కోట్ల డాలర్ల పెట్టుబడి అవకాశాలు విద్యుత్ సరఫరా, పంపిణీ రంగాల్లో ఉన్నట్లు వివరించారు. 2022నాటికి సౌర విద్యుత్ ఉత్పత్తిని లక్ష మెగావాట్లకు చేర్చాలన్న ప్రతిష్టాత్మక ప్రణాళికలను తమ ప్రభుత్వం అమలుచేస్తోందని గోయల్ తెలిపారు. ప్రభుత్వంపై నమ్మకం కుదిరింది: కార్పొరేట్లు కొత్త ప్రభుత్వం భారీ సంస్కరణలను ప్రకటించకపోయినా... మళ్లీ 8% వృద్ధి బాటలోని దేశాన్ని తీసుకెళ్లే దిశగా స్పష్టమైన కార్యాచరణను ప్రకటించిందని దేశ విదేశాలకు చెందిన కార్పొరేట్ దిగ్గజాలు పేర్కొన్నారు. సంస్కరణలు, పాలసీపరమైన చర్యలవిషయంలో ముందుకెళ్తుందని తమకు మోదీ ప్రభుత్వంపై నమ్మకం కుదిరిందని మహీంద్రా గ్రూప్ చీఫ్ ఆనంద్ మహీంద్రా, ఎతిహాద్ ఎయిర్వేస్ సీఈఓ జేమ్స్ హోగన్ తదితరులు అభిప్రాయపడ్డారు. -
ఎయిర్టెల్ నుంచి వన్ టచ్ ఇంటర్నెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫేస్బుక్, ట్విట్టర్, అమెజాన్ ఇలా ఏది కావాలన్నా వేర్వేరుగా సైట్లను ఓపెన్ చేయాలి. అలా కాకుండా ఒకే స్క్రీన్‌పై వేలాది యాప్స్‌తో టెలికం రంగంలో భారత్‌లో తొలిసారిగా వన్ టచ్ ఇంటర్నెట్ సేవలను ఎయిర్టెల్ ప్రారంభించింది. వార్తలు, వీడియోలు, సినిమా, గేమ్స్, షాపింగ్ వంటి యాప్స్ ఒకే స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. ఇంటర్నెట్ను తొలిసారిగా వాడే వారి కోసం ఈ సేవలను పరిచయం చేశామని ఎయిర్టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సీఈవో వెంకటేష్ విజయ్‌రాఘవన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. గ్రామీణ ప్రాంత కస్టమర్ల కోసం తెలుగుతోసహా 10 భాషల ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రతి రోజు 5 ట్రయల్ ప్యాక్స్‌ను కస్టమర్లు ఉచితంగా వాడొచ్చు. ఆ తర్వాత కస్టమర్ ఎంచుకున్న డాటా ప్యాక్‌నుబట్టి చార్జీలు ఉంటాయి. బ్యాలెన్స్, డాటా వినియోగం, ట్రయల్ ప్యాక్ స్థితిని ‘మై అకౌంట్’ ద్వారా తెలుసుకోవచ్చు. కస్టమర్ తన మొబైల్ నుంచి 111 నంబరుకు డయల్ చేస్తే చాలు లింక్‌తో కూడిన సందేశం వస్తుంది. లింక్‌పై క్లిక్ చేయగానే వన్ టచ్ ఇంటర్నెట్ స్క్రీన్ తెరుచుకుంటుంది. లేదా వన్.ఎయిర్టెల్.ఇన్ సైట్‌ను ఓపెన్ చేయాలి. -
ఎయిర్ టెల్ వైఫై జోన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కస్టమర్లకు సౌకర్యవంతమైన ఇంటర్నెట్ అందించేందుకు టెలికం రంగ సంస్థ ఎయిర్టెల్ ‘వైఫై’ బాట పట్టింది. మొబైల్, ట్యాబ్లెట్ పీసీ, ల్యాప్‌టాప్ ఇలా ఉపకరణం ఏదైనా వినియోగదారులు ఉన్న చోటే.. అదీ ఒక్క బటన్ నొక్కగానే ఇంటర్నెట్ పొందేలా ‘వైఫై’ జోన్లను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో (తెలంగాణ, సీమాంధ్ర) 130 ఎయిర్టెల్ స్టోర్లు, 20 కేఫ్ కాఫీ డే ఔట్లెట్లలో వైఫై జోన్లు ఏర్పాటయ్యాయి. కేఫ్ కాఫీ డే ఇతర ఔట్‌లెట్లకూ విస్తరిస్తామని సర్కిల్ సీఈవో వెంకటేశ్ విజయ్‌రాఘవన్ బుధవారమిక్కడ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. మొబైల్ ఫోన్ల రిటైల్ సంస్థతో త్వరలో ఒప్పందం చేసుకుని ఆ కంపెనీ ఔట్లెట్లలో వైఫై ఏర్పాటు చేస్తామన్నారు. పబ్లిక్ స్థలాల్లోనూ వైఫై జోన్లు అందుబాటులోకి తెస్తామన్నారు. వైఫై వాడుకున్నందుకు కస్టమర్లు ప్యాకేజీనిబట్టి చెల్లించాల్సి ఉంటుంది. 12,000 కిలోమీటర్లు..: ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 12,000 కిలోమీటర్లమేర ఎయిర్టెల్ ఫైబర్ విస్తరించింది. ఒక్క హైదరాబాద్‌లోనే ఇది 1,500 కిలోమీటర్లు కాగా, కవరేజ్ విషయంలో 85% పూర్తి చేసినట్టు కంపెనీ తెలిపింది. ఏపీ సర్కిల్లో 20 వేలు ఆపై జనాభా ఉన్న 200 పట్టణాలకుగాను 198 పట్టణాల్లో ఎయిర్టెల్ 3జీ కవరేజ్ ఉందని వివరించింది. హైదరాబాద్ సహా ఈ పట్టణాల్లో అవకాశం ఉన్నచోటల్లా వైఫై జోన్లు తీసుకొస్తామని వెంకటేశ్ పేర్కొన్నారు. 4జీ సేవ లు 6-8 నెలల్లో ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ప్రారంభం అవుతాయన్నారు. 3జీతో పోలిస్తే 4జీ సేవలు 25% ఖరీదెక్కువని, ఇంటర్నెట్ వేగం 40 ఎంబీపీఎస్ వరకు ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ను వైఫై నగరంగా తీర్చిదిద్దనున్న ‘హై-ఫై’ ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు సిద్ధమని చెప్పారు. 3జీ వైఫై డాంగిల్..: 21.6 ఎంబీపీఎస్ డౌన్లోడ్ వేగంతో ఇంటర్నెట్ను అందించే 3జీ వైఫై డాంగిల్‌ను ఎయిర్టెల్ తొలిసారిగా ఏపీ సర్కిల్లో ప్రవేశపెట్టింది. మొబైల్, ల్యాప్‌టాప్ వంటి 5 ఉపకరణాల్లో ఒకేసారి ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ధర రూ.2,499. యూనివర్సెల్, టెక్నోవిజన్, హాట్‌స్పాట్ ఔట్లెట్లలో రూ.2,100లకే లభిస్తుంది. ఆఫర్లో భాగంగా పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు రూ.700 క్యాష్‌బ్యాక్, ప్రీ పెయిడ్ కస్టమర్లకు 6జీబీ డాటా ఉచితం.