Venkatesh vijayraghavan
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కస్టమర్లకు సౌకర్యవంతమైన ఇంటర్నెట్ అందించేందుకు టెలికం రంగ సంస్థ ఎయిర్‌టెల్ ‘వైఫై’ బాట పట్టింది. మొబైల్, ట్యాబ్లెట్ పీసీ, ల్యాప్‌టాప్ ఇలా ఉపకరణం ఏదైనా వినియోగదారులు ఉన్న చోటే.. అదీ ఒక్క బటన్ నొక్కగానే ఇంటర్నెట్ పొందేలా ‘వైఫై’ జోన్లను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో (తెలంగాణ, సీమాంధ్ర) 130 ఎయిర్‌టెల్ స్టోర్లు, 20 కేఫ్ కాఫీ డే ఔట్‌లెట్లలో వైఫై జోన్లు ఏర్పాటయ్యాయి.
కేఫ్ కాఫీ డే ఇతర ఔట్‌లెట్లకూ విస్తరిస్తామని సర్కిల్ సీఈవో వెంకటేశ్ విజయ్‌రాఘవన్ బుధవారమిక్కడ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. మొబైల్ ఫోన్ల రిటైల్ సంస్థతో త్వరలో ఒప్పందం చేసుకుని ఆ కంపెనీ ఔట్‌లెట్లలో వైఫై ఏర్పాటు చేస్తామన్నారు. పబ్లిక్ స్థలాల్లోనూ వైఫై జోన్లు అందుబాటులోకి తెస్తామన్నారు. వైఫై వాడుకున్నందుకు కస్టమర్లు ప్యాకేజీనిబట్టి చెల్లించాల్సి ఉంటుంది.
12,000 కిలోమీటర్లు..: ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 12,000 కిలోమీటర్లమేర ఎయిర్‌టెల్ ఫైబర్ విస్తరించింది. ఒక్క హైదరాబాద్‌లోనే ఇది 1,500 కిలోమీటర్లు కాగా, కవరేజ్ విషయంలో 85% పూర్తి చేసినట్టు కంపెనీ తెలిపింది. ఏపీ సర్కిల్‌లో 20 వేలు ఆపై జనాభా ఉన్న 200 పట్టణాలకుగాను 198 పట్టణాల్లో ఎయిర్‌టెల్ 3జీ కవరేజ్ ఉందని వివరించింది. హైదరాబాద్ సహా ఈ పట్టణాల్లో అవకాశం ఉన్నచోటల్లా వైఫై జోన్లు తీసుకొస్తామని వెంకటేశ్ పేర్కొన్నారు. 4జీ సేవ లు 6-8 నెలల్లో ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో ప్రారంభం అవుతాయన్నారు.
3జీతో పోలిస్తే 4జీ సేవలు 25% ఖరీదెక్కువని, ఇంటర్నెట్ వేగం 40 ఎంబీపీఎస్ వరకు ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ను వైఫై నగరంగా తీర్చిదిద్దనున్న ‘హై-ఫై’ ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు సిద్ధమని చెప్పారు.
3జీ వైఫై డాంగిల్..: 21.6 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ వేగంతో ఇంటర్నెట్‌ను అందించే 3జీ వైఫై డాంగిల్‌ను ఎయిర్‌టెల్ తొలిసారిగా ఏపీ సర్కిల్‌లో ప్రవేశపెట్టింది. మొబైల్, ల్యాప్‌టాప్ వంటి 5 ఉపకరణాల్లో ఒకేసారి ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ధర రూ.2,499. యూనివర్‌సెల్, టెక్నోవిజన్, హాట్‌స్పాట్ ఔట్‌లెట్లలో రూ.2,100లకే లభిస్తుంది. ఆఫర్‌లో భాగంగా పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు రూ.700 క్యాష్‌బ్యాక్, ప్రీ పెయిడ్ కస్టమర్లకు 6జీబీ డాటా ఉచితం.