హైదరాబాద్, వైజాగ్‌లో ఎయిర్‌టెల్ 4జీ ట్రయల్
⇒ 3జీ ధరకే 4జీ సర్వీసులు
⇒ డిసెంబర్‌కల్లా విజయవాడలో 4జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ ఎయిర్‌టెల్ హైదరాబాద్, వైజాగ్‌లో 4జీ సర్వీసులను ప్రయోగాత్మకంగా సోమవారం ప్రారంభించింది. ప్రస్తుత కస్టమర్లకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా కస్టమర్లు 3జీ ధరకే 4జీ సేవలు పొందవచ్చని భారతి ఎయిర్‌టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్ సీఈవో వెంకటేశ్ విజయ్‌రాఘవన్ ఈ సందర్భంగా తెలిపారు.
ప్రపంచ స్థాయి 4జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా ట్రయల్ కాలంలో వినియోగదార్ల నుంచి సూచనలు స్వీకరిస్తామని వివరించారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఎంపిక చేసిన కంపెనీల మోడళ్లను కొన్న కస్టమర్లు సైతం 4జీ సేవలు పొందవచ్చు.
రెండింతల డేటా..: ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు 30 రోజుల వాలిడిటీతో 1 జీబీ 3జీ ప్యాక్‌ను రూ.249కి అందిస్తోంది. పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు రూ.250ల నెల ప్లాన్‌లో 1 జీబీ 4జీ డేటా ఇస్తోంది. ఇక ఫ్లిప్‌కార్ట్ ద్వారా షియోమీ, లెనోవో, మోటరోలా, ఆసస్, హువావే మోడళ్లను కొన్న కస్టమర్లు రెండింతల డేటా ప్రయోజనం పొందవచ్చు. ఎంపిక చేసిన శాంసంగ్ మోడళ్లకూ ఇది వర్తిస్తుంది. ఇక ఎయిర్‌టెల్‌కు హైదరాబాద్‌లో 7 లక్షలు, వైజాగ్‌లో 2 లక్షల మంది 3జీ కస్టమర్లున్నారు. వీరు ఎటువంటి అదనపు చార్జీ లేకుండా 4జీ సిమ్‌ను ఉచితంగా తీసుకోవచ్చు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ కస్టమర్లలో 2 లక్షల మంది వద్ద 4జీ స్మార్ట్‌ఫోన్లు ఉన్నట్లు అంచనా.
డిసెంబర్‌కల్లా ప్రధాన నగరాల్లో..
హైదరాబాద్, వైజాగ్‌లో నాలుగైదు వారాల్లో వాణిజ్యపరంగా 4జీ సేవలను ఎయిర్‌టెల్ ప్రారంభించనుంది. విజయవాడ, వరంగల్, కర్నూలు, తిరుపతి పట్టణాల్లో డిసెంబర్‌లోగా 4జీ అడుగిడనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన జిల్లా కేంద్రాలు, పట్టణాలకు ఏడాదిలో విస్తరించాలన్నది ప్రణాళిక. కాగా, 4జీ వైఫై రౌటర్‌ను రూ.2,500లకు కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా 32 ఉపకరణాల్లో ఇంటర్నెట్ వాడొచ్చు. 4జీ డాంగిల్ రూ. 1,500, 4జీ హాట్‌స్పాట్ రూ.2,300, వైఫై డాంగిల్ రూ.2,300లకు విక్రయిస్తోంది. ప్రస్తుతం 28 నగరాల్లో ఎయిర్‌టెల్ 4జీ అడుగు పెట్టింది.