ఇన్వెస్టర్లలో కొండంత విశ్వాసం
న్యూఢిల్లీ: భారత్‌పై పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంచడంలో తమ ప్రభుత్వం విజయవంతమైందని కేంద్ర విద్యుత్, బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. విశ్వాసం ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకుందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్), భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహిస్తున్న భారత్ ఆర్థిక సదస్సులో గురువారం జరిగిన చర్చలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘వ్యాపారాలు విజయవంతమైతే... ప్రజల జీవితాలను మేం మెరుగుపరుస్తాం. పేదలు-వ్యాపారవేత్తలిద్దరికీ చేదోడుగా ఉంటామన్న మా ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి వైరుధ్యం లేదు. ఆర్థిక క్రమశిక్షణకు చర్యలతో పాటు పాలనలో పారదర్శకతకు వీలుగా చర్యలు మొదలుపెట్టాం’ అని గోయల్ వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ అధిక వృద్ధి బాటలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.
2019 కల్లా 100 కోట్ల టన్నులకు బొగ్గు ఉత్పత్తి
వచ్చే ఐదేళ్లలో(2019 కల్లా) బొగ్గు ఉత్పత్తిని రెట్టింపు చేసి 100 కోట్ల టన్నులకు చేర్చాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని గోయల్ వెల్లడించారు. దేశంలో ఇంధన డిమాండ్‌ను తట్టుకోవాలంటే ఉత్పత్తి పెంపే మార్గమన్నారు. ఈ ఏడాది దేశీయంగా బొగ్గు ఉత్పత్తి సుమారు 50 కోట్ల టన్నులు ఉండొచ్చన్నారు. ఇక బొగ్గు ఉత్పత్తిలో ప్రైవేటు రంగం పాత్రను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
అదేవిధంగా రానున్న 4-5 ఏళ్ల వ్యవధిలో దేశీ ఇంధన రంగంలో 2,500 కోట్ల డాలర్ల మేర భారీ పెట్టుబడి అవకాశాలున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు గోయల్ చెప్పారు. ఇందులో 1,000 కోట్ల డాలర్లు పునరుత్పాదక ఇంధన రంగంలో 500 కోట్ల డాలర్ల పెట్టుబడి అవకాశాలు విద్యుత్ సరఫరా, పంపిణీ రంగాల్లో ఉన్నట్లు వివరించారు. 2022నాటికి సౌర విద్యుత్ ఉత్పత్తిని లక్ష మెగావాట్లకు చేర్చాలన్న ప్రతిష్టాత్మక ప్రణాళికలను తమ ప్రభుత్వం అమలుచేస్తోందని గోయల్ తెలిపారు.
ప్రభుత్వంపై నమ్మకం కుదిరింది: కార్పొరేట్లు
కొత్త ప్రభుత్వం భారీ సంస్కరణలను ప్రకటించకపోయినా... మళ్లీ 8% వృద్ధి బాటలోని దేశాన్ని తీసుకెళ్లే దిశగా స్పష్టమైన కార్యాచరణను ప్రకటించిందని దేశ విదేశాలకు చెందిన కార్పొరేట్ దిగ్గజాలు పేర్కొన్నారు. సంస్కరణలు, పాలసీపరమైన చర్యలవిషయంలో ముందుకెళ్తుందని తమకు మోదీ ప్రభుత్వంపై నమ్మకం కుదిరిందని మహీంద్రా గ్రూప్ చీఫ్ ఆనంద్ మహీంద్రా, ఎతిహాద్ ఎయిర్‌వేస్ సీఈఓ జేమ్స్ హోగన్ తదితరులు అభిప్రాయపడ్డారు.