One Touch Internet
-
ఈచ్ వన్ టీచ్ వన్
ఒక్క క్లిక్‌లో ప్రజలందరికీ ప్రపంచ స్థాయి సేవలు అందించేలా భారత ప్రభుత్వం చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’ స్ఫూర్తితో ఎయిర్టెల్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఒక్కరికీ, ఇంటర్నెట్పై అవగాహన కల్పించేలా గురువారం మెగా ఈవెంట్... ‘ఈచ్ వన్ టీచ్ వన్’ నిర్వహిస్తోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ఎయిర్టెల్ ఉద్యోగులు ఇందుల భాగస్వాములవుతారు. తమ పనులను పక్కనబెట్టి రోజంతా వాడవాడలా తిరిగి ఇంటర్నెట్ గురించి ప్రజలకు వివరిస్తారని ఎయిర్టెల్ ఏపీ, తెలంగాణ సర్కిల్ సీఈఓ వెంకటేశ్ విజయ్‌రాఘవన్ చెప్పారు. ఈ కార్యక్రమం గురించి ఆయన మాటల్లోనే... సామాజిక సేవలో మా వంతు బాధ్యతగా చేపట్టిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 17 వేల మంది సంస్థ ఉద్యోగులు పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని 600 మంది ఉద్యోగులతో పాటు డిస్ట్రిబ్యూటర్స్, రిటైలర్స్ కలిపి దాదాపు 25 వేల మంది ఈ మెగా ఈవెంట్లో భాగస్వాములవుతున్నారు. నగరంలోని 110 లొకేషన్సకు వెళ్లి క్యాంపెయిన్ నిర్వహిస్తారు. అందరికీ అందుబాటులో... స్మార్ట్ ఫోన్లు ఉన్నవారికే కాదు, సాధారణ మొబైల్స్ వాడే సామాన్యులకు కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఎయిర్టెల్ ‘ఈచ్ వన్ టీచ్ వన్’ నిర్వహిస్తోంది. సరైన అవగాహన లేక చాలా మంది నెట్‌ను ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇలాంటి వారికి అవగాహన పెంచి ‘డిజిటల్ లిటరసీ’ని ప్రమోట్ చేయడం దీని ముఖ్యోద్దేశం. ఈ క్రమంలో ఎయిర్టెల్ ఉద్యోగులు... బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, బస్తీలు తదితర ప్రాంతాల్లోని దాదాపు 1.2 లక్షల మందిని ప్రత్యక్షంగా కలుస్తారు. ఇంటర్నెట్ వాడకం, దాని ప్రయోజనాల గురించి వివరిస్తారు. ఇలాంటి కార్యక్రమం చేపట్టడం బహుశా ఇదే తొలిసారి. సాధ్యమైనంత మందికి ఇంటర్నెట్ సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా కదులుతున్నాం. ఇటీవల ఎయిర్టెల్ లాంచ్ చేసిన ‘వన్ టచ్ ఇంటర్నెట్’ పోర్టల్ ఉద్దేశం కూడా ఇదే. సినిమాలు, పాటలు, సామాజిక సైట్లే కాదు... టికెట్ బుకింగ్, ఈ కామర్స్ వంటి అన్నింటికీ వన్ స్టాప్ షాప్ ఈ పోర్టల్. ఈవెంట్: ఈచ్ వన్ టీచ్ వన్ ప్రారంభం: బేగంపేట్ ఎయిర్టెల్ ప్రధాన కార్యాలయం సమయం: ఉదయం 10.30 గంటలకు -
ఇన్వెస్టర్లలో కొండంత విశ్వాసం
న్యూఢిల్లీ: భారత్‌పై పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంచడంలో తమ ప్రభుత్వం విజయవంతమైందని కేంద్ర విద్యుత్, బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. విశ్వాసం ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకుందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్), భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహిస్తున్న భారత్ ఆర్థిక సదస్సులో గురువారం జరిగిన చర్చలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వ్యాపారాలు విజయవంతమైతే... ప్రజల జీవితాలను మేం మెరుగుపరుస్తాం. పేదలు-వ్యాపారవేత్తలిద్దరికీ చేదోడుగా ఉంటామన్న మా ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి వైరుధ్యం లేదు. ఆర్థిక క్రమశిక్షణకు చర్యలతో పాటు పాలనలో పారదర్శకతకు వీలుగా చర్యలు మొదలుపెట్టాం’ అని గోయల్ వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ అధిక వృద్ధి బాటలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. 2019 కల్లా 100 కోట్ల టన్నులకు బొగ్గు ఉత్పత్తి వచ్చే ఐదేళ్లలో(2019 కల్లా) బొగ్గు ఉత్పత్తిని రెట్టింపు చేసి 100 కోట్ల టన్నులకు చేర్చాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని గోయల్ వెల్లడించారు. దేశంలో ఇంధన డిమాండ్‌ను తట్టుకోవాలంటే ఉత్పత్తి పెంపే మార్గమన్నారు. ఈ ఏడాది దేశీయంగా బొగ్గు ఉత్పత్తి సుమారు 50 కోట్ల టన్నులు ఉండొచ్చన్నారు. ఇక బొగ్గు ఉత్పత్తిలో ప్రైవేటు రంగం పాత్రను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా రానున్న 4-5 ఏళ్ల వ్యవధిలో దేశీ ఇంధన రంగంలో 2,500 కోట్ల డాలర్ల మేర భారీ పెట్టుబడి అవకాశాలున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు గోయల్ చెప్పారు. ఇందులో 1,000 కోట్ల డాలర్లు పునరుత్పాదక ఇంధన రంగంలో 500 కోట్ల డాలర్ల పెట్టుబడి అవకాశాలు విద్యుత్ సరఫరా, పంపిణీ రంగాల్లో ఉన్నట్లు వివరించారు. 2022నాటికి సౌర విద్యుత్ ఉత్పత్తిని లక్ష మెగావాట్లకు చేర్చాలన్న ప్రతిష్టాత్మక ప్రణాళికలను తమ ప్రభుత్వం అమలుచేస్తోందని గోయల్ తెలిపారు. ప్రభుత్వంపై నమ్మకం కుదిరింది: కార్పొరేట్లు కొత్త ప్రభుత్వం భారీ సంస్కరణలను ప్రకటించకపోయినా... మళ్లీ 8% వృద్ధి బాటలోని దేశాన్ని తీసుకెళ్లే దిశగా స్పష్టమైన కార్యాచరణను ప్రకటించిందని దేశ విదేశాలకు చెందిన కార్పొరేట్ దిగ్గజాలు పేర్కొన్నారు. సంస్కరణలు, పాలసీపరమైన చర్యలవిషయంలో ముందుకెళ్తుందని తమకు మోదీ ప్రభుత్వంపై నమ్మకం కుదిరిందని మహీంద్రా గ్రూప్ చీఫ్ ఆనంద్ మహీంద్రా, ఎతిహాద్ ఎయిర్వేస్ సీఈఓ జేమ్స్ హోగన్ తదితరులు అభిప్రాయపడ్డారు. -
ఎయిర్టెల్ నుంచి వన్ టచ్ ఇంటర్నెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫేస్బుక్, ట్విట్టర్, అమెజాన్ ఇలా ఏది కావాలన్నా వేర్వేరుగా సైట్లను ఓపెన్ చేయాలి. అలా కాకుండా ఒకే స్క్రీన్‌పై వేలాది యాప్స్‌తో టెలికం రంగంలో భారత్‌లో తొలిసారిగా వన్ టచ్ ఇంటర్నెట్ సేవలను ఎయిర్టెల్ ప్రారంభించింది. వార్తలు, వీడియోలు, సినిమా, గేమ్స్, షాపింగ్ వంటి యాప్స్ ఒకే స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. ఇంటర్నెట్ను తొలిసారిగా వాడే వారి కోసం ఈ సేవలను పరిచయం చేశామని ఎయిర్టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సీఈవో వెంకటేష్ విజయ్‌రాఘవన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. గ్రామీణ ప్రాంత కస్టమర్ల కోసం తెలుగుతోసహా 10 భాషల ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రతి రోజు 5 ట్రయల్ ప్యాక్స్‌ను కస్టమర్లు ఉచితంగా వాడొచ్చు. ఆ తర్వాత కస్టమర్ ఎంచుకున్న డాటా ప్యాక్‌నుబట్టి చార్జీలు ఉంటాయి. బ్యాలెన్స్, డాటా వినియోగం, ట్రయల్ ప్యాక్ స్థితిని ‘మై అకౌంట్’ ద్వారా తెలుసుకోవచ్చు. కస్టమర్ తన మొబైల్ నుంచి 111 నంబరుకు డయల్ చేస్తే చాలు లింక్‌తో కూడిన సందేశం వస్తుంది. లింక్‌పై క్లిక్ చేయగానే వన్ టచ్ ఇంటర్నెట్ స్క్రీన్ తెరుచుకుంటుంది. లేదా వన్.ఎయిర్టెల్.ఇన్ సైట్‌ను ఓపెన్ చేయాలి.