అజ్మీర్ దర్గాకు బాంబు బెదిరింపు
దేశంలోనే కాక విదేశాల్లోనూ ఎంతో ప్రాచుర్యం పొందిన అజ్మీర్ దర్గాకు బాంబు బెదిరింపు వచ్చింది. 12వ శతాబ్దం నాటి ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గాలో బాంబు పెట్టినట్లు సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేయడంతో వెంటనే దర్గాను ఖాళీ చేయించారు. ఆ సమయానికి దర్గాలో దాదాపు లక్ష మంది వరకు భక్తులు ఉన్నారు. దర్గాలోకి బాంబు డిటెక్టర్లతో పోలీసు కమాండోలు ప్రవేశించడంతో వాళ్లంతా ఒక్కసారిగా భయంతో వణికిపోయారు.
మొత్తం అన్ని గేట్ల నుంచి భక్తులను బయటకు పంపి, మొత్తం ప్రాంగణం అంతటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దాదాపు అరగంట పాటు తనిఖీ చేసిన తర్వాత అక్కడ ఎలాంటి బాంబు లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఆ ప్రాంతంలో హై ఎలర్ట్ ప్రకటించి, క్విక్ రెస్పాన్స్ బృందాలు ఆ మార్గాన్ని తమ అదుపులోకి తీసుకున్నాయి. తెల్లవారుజామున 6.40 గంటల సమయంలో ఈ ఫోన్ కాల్ వచ్చింది. దర్గాను పేల్చేస్తామని బెదిరింపు రావడంతో ఉదయం 7.45 నుంచి 9.15 వరకు దర్గాను మూసేసినట్లు పోలీసులు తెలిపారు.