'బావగారూ... మాట నిలబెట్టుకోండి'
లక్నో: సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్ష బాధ్యతలు ములాయం సింగ్ కు అప్పగించాలని అఖిలేశ్ యాదవ్ ను ఆయన మరదలు అపర్ణ యాదవ్ కోరారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. ములాయంను పదవీత్యుడిని చేయడం తనను కలచివేసిందని వెల్లడించారు. ఈగో సమస్యల వల్లే ఎన్నికల్లో తాను ఓడిపోయానని చెప్పారు.
'అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని తిరిగి అప్పగిస్తానని అఖిలేశ్ జనవరిలో చెప్పారు. తాను మాటమీద నిలబడే వ్యక్తినని అఖిలేశ్ చెబుతుంటారు. ఇప్పుడు ఆయన మాట నిలబెట్టుకుంటారని భావిస్తున్నాను. నేతాజీ బతికున్నంత వరకు మా ఇంట్లో ఆయన మాటే ఫైనల్. ఎన్నికలకు ముందు ఆయనను పరాభవానికి గురిచేయడం నన్ను కలచివేసింది. ఆయన కూడా చాలా బాధ పడ్డారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను. కుటుంబమంతా కలిసివుండాలని కోరుకుంటున్నాను. మా పార్టీ ఎప్పుడు గెలవని లక్నో కంటోన్మెంట్ నుంచి పోటీ చేశాను. మేము నియమించిన బృందం ఈగో సమస్యలతో సమన్వయంతో పనిచేయలేదు. ఈ విషయాన్ని నేతాజీ, అఖిలేశ్ దృష్టికి తీసుకెళ్లినా వారేమీ చేయలేకపోయార'ని అపర్ణ యాదవ్ వివరించారు.