ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో హైడ్రామా కొనసాగుతోంది.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో హైడ్రామా కొనసాగుతోంది. తండ్రి ములాయం సింగ్ యాదవ్, బాబాయ్ శివపాల్ యాదవ్‌లతో రాజీకోసం చర్చలు జరుపుతూనే.. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీని పూర్తిగా తన ఆధిపత్యంలోకి తీసుకోవడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. అఖిలేష్ వర్గం.. ములాయం, శివపాల్‌లకు మరో ఊహించని షాక్ ఇచ్చింది. ఎస్పీకి చెందిన బ్యాంకు ఎకౌంట్లను స్తంభింపజేయాలని కోరుతూ అఖిలేష్ వర్గం బ్యాంకులను కోరినట్టు న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్‌ఎస్ వెల్లడించింది.
ఎస్పీకి విరాళాల రూపంలో వచ్చిన డబ్బు 500 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్టు సమాచారం. ఎస్పీకి సంబంధించి ప్రస్తుతం శివపాల్ యాదవ్ సంతకంపై బ్యాంకు లావాదేవీలు జరుగుతున్నాయి. ములాయం, శివపాల్‌లతో విభేదిస్తున్న అఖిలేష్ వర్గం.. ఎస్పీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసేందుకు ప్రయత్నిస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి ములాయంను, యూపీ పార్టీ శాఖ చీఫ్ పదవి నుంచి శివపాల్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్‌ను ఎన్నుకున్నారు. ఆయనకు మరో బాబాయ్ రాంగోపాల్ యాదవ్‌తో పాటు సీనియర్ నేతలు,ఎంపీలు, 200 మందికిపైగా ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారు. అఖిలేష్ వర్గం ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలసి పార్టీ గుర్తు సైకిల్‌ను తమకు కేటాయించాల్సిందిగా కోరింది. ఆధిపత్య పోరులో ములాయం దాదాపుగా ఒంటరి అయిపోయారు. ఆయన శిబిరంలో తమ్ముడు శివపాల్, సన్నిహితుడు అమర్ సింగ్, కొద్ది మంది నేతలు, ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.