వెళ్లే సమయమొచ్చింది.. ఓటమిపై సీఎం నిర్వేదం
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో అధికార సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ కూటమి ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో ఆయన శనివారం లక్నోలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. అనంతరం సీఎం పదవికి రాజీనామా చేశారు. విలేకరుల సమావేశంలో ఒకింత నిర్వేదంగా కనిపించిన అఖిలేశ్.. 'ప్రజలకు మా ఎక్స్‌ప్రెస్ వే నచ్చలేదేమో. అందుకే బుల్లెట్ ట్రెయిన్‌కు ఓటు వేశారు. ప్రజలు ఎన్నికల కేంద్రానికి వెళ్లారు కానీ మాకు ఓటువేయలేదేమో అనిపిస్తుంది' అని అన్నారు.
ఈవీఎంలు ట్యాపరింగ్ చేశారంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని, దీనిపై తాను కూడా పరిశీలన జరుపుతామని చెప్పారు. రానున్న ప్రభుత్వం తమ ప్రభుత్వం కంటే బాగా పనిచేయాలని కోరుకుంటున్నట్టు అఖిలేశ్ పేర్కొన్నారు. ఎన్నికల తీర్పుపై సమీక్ష చేసిన అనంతరమే ఓటమికి బాధ్యత తీసుకుంటానని ఆయన అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు వల్లే ఎస్పీ ఓటమిపాలైందన్న విమర్శలు వస్తున్నప్పటికీ, ఆ పార్టీతో పొత్తు భవిష్యత్తులోనూ కొనసాగుతుందని అఖిలేశ్ స్పష్టం చేశారు. అనంతరం తన ఇంటిముందు గుమిగూమిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 'ఇక నేను వెళ్లాల్సిన సమయం వచ్చిందనుకుంటా' అంటూ అఖిలేశ్ వ్యాఖ్యానించారు.