బీజేపీని అడ్డుకునేందుకు ఎవరితోనైనా కలుస్తాం!
⇒ ఎగ్జిట్‌పోల్స్ నేపథ్యంలో అఖిలేశ్ ప్రకటన
⇒ బీఎస్పీతో దోస్తీకీ సిద్ధమనే సంకేతాలు
⇒ యూపీ పీఠం బీజేపీదేనన్న రాజ్‌నాథ్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ హంగ్‌ను సూచిస్తుండటంతో.. సీఎం అఖిలేశ్ యాదవ్ ముందస్తు ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయకుండా ఎవరితోనైనా కలుస్తామని గురువారం ప్రకటించారు. బీఎస్పీతో పొత్తు విషయాన్ని కూడా అఖిలేశ్ పూర్తిగా ఖండించలేదు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా.. మేజిక్ ఫిగర్‌కు చేరుకోలేదన్న వార్తల నేపథ్యంలో పొత్తుపై అన్ని సాధ్యమైన మార్గాలను పరిశీలిస్తున్నామని బీబీసీతో మాట్లాడుతూ అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీని అడ్డుకోవటమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.
‘యూపీలో రాష్ట్రపతి పాలన రావాలని, బీజేపీ రిమోట్ కంట్రోల్ ద్వారా ఢిల్లీ నుంచి పాలించాలని ఎవరూ కోరుకోవటం లేదు. ఎస్పీ–కాంగ్రెస్‌కు సరిపోయేటంత సీట్లు వస్తాయి. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం. ఒకవేళ కాస్త తగ్గితే పొత్తుపై ఆలోచిస్తాం. బీఎస్పీతో పొత్తుపై ఇప్పడేమీ చెప్పలేను. కానీ మాయావతి నాకు బంధువులాంటి వారు. నేను ఆమెను బౌజీ (ఆంటీ)గా పిలుస్తాను’ అని అఖిలేశ్ తెలిపారు.
శనివారం ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో అఖిలేశ్ వార్తలు కొత్త పొత్తులకు దార్లు తెరిచాయని నిపుణులంటున్నారు. కాగా, అఖిలేశ్ రెండోసారీ సీఎంగా బాధ్యతలు తీసుకుంటారని ఆ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో కలిసి స్పష్టమైన మెజారిటీ సంపాదిస్తామన్నారు. అటు, యూపీ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణమైన మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంటుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీలో తెలిపారు. బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరన్న విషయంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.