అల్ కాయిదా నెంబర్ 2 హతం!
అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో అల్ కాయిదా నెం.2 ఉగ్రవాది హతమయ్యాడు. అల్ కాయిదాకు సంబంధించిన యెమెన్ విభాగానికి నేతృత్వం వహించిన నసీర్ అల్ వహాయిసి మరణించినట్లు జూన్ 14న విడుదలైన వీడియో ప్రకటనలో నిర్ధరించారు. ఒసామా బిన్ లాడెన్ను అమెరికన్ నేవీ సీల్స్ హతమార్చిన తర్వాత ఆ ఉగ్రవాద సంస్థకు తగిలిన అతిపెద్ద దెబ్బ ఇదే. అంతర్జాతీయంగా 'జీహాద్' మీద ఆధిపత్యం కోసం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో పోటీ పడుతున్న తరుణంలో అల్ కాయిదాకు ఇంతటి అగ్రనేతను కోల్పోవడం కోలుకోలేని దెబ్బ అవుతుందని అంటున్నారు. నసీర్ మరణంతో అతడి స్థానంలో ఖాసిం అల్ రైమి అనే ఉగ్రవాద నాయకుడిని నియమించినట్లు తెలిసింది. ఈ నియామకం విషయాన్ని, నసీర్ మరణాన్ని ప్రకటించిన వీడియోలోనే.. అమెరికా మీద తమ యుద్ధం కొనసాగుతుందని చెప్పారు.
అల్ కాయిదా ఆధీనంలో ఉన్న ముకల్లా అనే నగరంలో అమెరికా చేసిన వైమానిక దాడుల్లో ముగ్గురు అనుమానిత అల్ కాయిదా ఉగ్రవాదులు మరణించినట్లు యెమెనీ భద్రతా అధికారులు ఇంతకుముందు తెలిపారు. అయితే, వాళ్లలో అల్ కాయిదాకు చెందిన ఇంత అగ్రనేత ఉంటాడని మాత్రం వాళ్లు కూడా భావించలేదు. ఇక అమెరికన్ అధికారులు కూడా నిజంగా నసీర్ అల్ వహాయిసి మరణించాడో లేదో ఇంకా నిర్ధరించుకోవాల్సి ఉందని అంటున్నారు.