వాషింగ్టన్: పశ్చిమ ఆసియాలోని తమ రాయబార కార్యాలయాలపై అల్‌కాయిదా దాడులకు తెగబడొచ్చన్న నిఘా హెచ్చరికలతో అప్రమత్తమైన అమెరికా తాజాగా అల్‌కాయిదాపై ఎదురుదాడికి సిద్ధమవుతోంది. అరేబియన్ ద్వీపకల్పం (ఏక్యూఏపీ)లోని అల్‌కాయిదా ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ అక్కడున్న తమ దేశ ప్రత్యేక దళాలను అప్రమత్తం చేసింది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు చెందిన కార్యాలయాలపై దాడులకు తుది సన్నాహాలు చేసుకోవాలంటూ అల్‌కాయిదా చీఫ్ అల్‌జవహరి, ఏక్యూఏపీలో అల్‌కాయిదా నేత నసీర్ అల్‌వుహాషీల మధ్య సాగిన సంభాషణలను అగ్రరాజ్యం పసిగట్టిందని ‘ద న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. ఆ నేపథ్యంలో అమెరికా ఎదురుదాడికి వ్యూహం రచిస్తోంది.