
ఇంగ్లండ్ సరికొత్త రికార్డు
ఐదు వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ సరికొత్త రికార్డు సృష్టించింది.
బర్మింగ్హమ్: ఐదు వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ సరికొత్త రికార్డు సృష్టించింది. 255 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించి కొత్త రికార్డు నమోదు చేసింది. ఓపెనర్లు అలెక్స్ హేల్స్(133 నాటౌట్;110 బంతుల్లో 10 ఫోర్లు,6 సిక్సర్లు), జాసన్ రాయ్(112 నాటౌట్;95 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఇంగ్లండ్కు పది వికెట్ల విజయాన్ని అందించారు. తద్వారా వన్డేల్లో వికెట్ కోల్పోకుండా 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి కొత్త రికార్డు నమోదు చేశారు. దీంతో అంతకుముందు వన్డేల్లో న్యూజిలాండ్ వికెట్ కోల్పోకుండా ఛేదించిన రికార్డు తెరమరుగైంది. 2015లో జింబాబ్వేపై న్యూజిలాండ్ 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
శుక్రవారం జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 254 పరుగులు చేసింది. శ్రీలంక ఆటగాళ్లలో చండిమాల్(52), కెప్టెన్ ఏంజెలా మాథ్యూస్(44), ఉపుల్ తరంగా(55 నాటౌట్) రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును సాధించారు. అనంతరం బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ ఆది నుంచి శ్రీలంకపై విరుచుకుపడింది. జాసన్ రాయ్, అలెక్స్ల జోడి దూకుడు ఆడటంతో ఇంగ్లండ్ 34.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు వన్డేల సిరీస్లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యం సాధించింది. తొలి వన్డే టైగా ముగిసిన సంగతి తెలిసిందే.