జైలుపాలైన ప్రముఖ నటి, ఆమె తల్లి!
ప్రముఖ బాలీవుడ్ నటి అల్కా కౌశల్, ఆమె తల్లి జైలుపాలయ్యారు. సల్మాన్‌ఖాన్ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా బజరంగీ భాయ్‌జాన్‌లో కరీనాకపూర్ తల్లిగా, కంగనా రనౌత్ 'క్వీన్' కథానాయిక తల్లిగా అల్కా కౌశల్ నటించారు. అంతేకాదు ప్రముఖ బుల్లితెర నటిగా వెలుగొందుతున్న ఆమె ప్రస్తుతం ప్రసారమవుతున్న పలు హిందీ సీరియళ్లలోనూ కీలకమైన నెగిటివ్ పాత్ర పోషిస్తున్నారు. చెక్ బౌన్స్ కేసులో పంజాబ్‌లోని ఓ జిల్లా కోర్టు ఆమెకు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. పరిచయస్తుడి దగ్గర సీరియల్ నిర్మాణం పేరిట అల్కా, ఆమె తల్లి రూ. 50 లక్షలు తీసుకున్నారని, తిరిగి చెల్లించాలని కోరగా.. అతని రూ. 25 లక్షల రెండు చెక్కులు ఇచ్చారని, అవి బౌన్స్ అవ్వడంతో కోర్టు వారికి రెండేళ్ల జైలు శిక్ష విధించిందని న్యాయవాది ఉటంకిస్తూ అమర్ ఉజలా పత్రిక తెలిపింది.
అవతార్ సింగ్ అనే వ్యక్తి వద్ద డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకపోగా.. వారు దొంగతనం, మనీలాండరింగ్‌వంటి అక్రమాలకు పాల్పడ్డారని న్యాయవాది చెప్పారు. 2015లో అల్కా కౌషల్‌కు స్థానిక కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించగా.. పైకోర్టులో సవాల్ చేయడం ద్వారా ఆమె అప్పట్లో శిక్ష నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు ఆ కేసును విచారించిన సంగ్రూర్ జిల్లా కోర్టు ఆమెకు, ఆమె తల్లికి రెండేళ్ల జైలుశిక్ష విధించింది.