ఆ విమానానికి ఏమైనట్టు!
- అన్ని సంకేతాలు చెడును సూచిస్తున్నాయన్న పారికర్
భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్-32 విమానం గల్లంతై ఐదురోజులు కావొస్తున్నది. ఈ విమానం జాడ కోసం ముమ్మరంగా భద్రతా దళాలు గాలిస్తూనే ఉన్నాయి. అయినా, 29మంది భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న ఆ విమానికి ఏమైందన్న జాడ ఇప్పటికీ తెలియలేదు. విమానంలో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బతికి బయటపడే ఆశలు అంతకంతకూ అడుగంటిపోతున్నాయి.
విమానం ఆచూకీ కోసం ఇప్పటివరకు నిర్వహించిన ఆపరేషన్‌లో అన్ని ప్రతికూల సంకేతాలు అందాయని భద్రతా వర్గాలు తెలిపాయి. ఈ విషయమై కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ మంగళవారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు చాలా సంకేతాలు అందాయి. అన్ని సంకేతాలు చెడునే సూచిస్తున్నాయి. ఓ ప్రాంతం నుంచి వచ్చిన సమాచారం, లింకులను ఆధారంగా సమగ్ర నిర్ధారణకు వచ్చేందుకు మేం ప్రయత్నిస్తున్నాం.ఈ విషయంలో తప్పుడు సంకేతాలు కూడా కొన్ని అందుతున్నాయి. కాబట్టి అన్నింటినీ బేరిజువేసుకొని ఓ నిర్ధారణకు రావాలని భావిస్తున్నాం’ అని తెలిపారు. జాతీయ సముద్ర టెక్నాలజీకి చెందిన సాగర్ నిధి క్లాసికల్ మంచు ఓడను మారిషస్ నుంచి రప్పిచామని, ఇది ఎంత లోతులోనైనా ప్రయాణించగలదని చెప్పారు. అయితే, ఏ ప్రాంతంలో దీనిద్వారా ఆపరేషన్ చేపట్టాలనేది నిర్ణయించాల్సి ఉందని ఆయన చెప్పారు.