
మలాలాపై దాడి కేసు దోషులకు పాతికేళ్ల జైలు
మలాలా యూసుఫ్జాయ్.. తీవ్రవాదులను ధైర్యంగా ఎదిరించి నోబెల్ శాంతి బహుమతి పొందిన యువతి. ఆమెపై దాడి చేసిన కేసులో దోషులకు పాకిస్థాన్లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు పాతికేళ్ల జైలుశిక్ష విధించింది. మలాలాతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలపై దాడి చేసిన కేసులో నిందితులైన ఉగ్రవాదులను గత సంవత్సరం సెప్టెంబర్లో అరెస్టు చేశారు. వాళ్లందరికీ కోర్టు 25 సంవత్సరాల విధించింది.
మలాలా యూసుఫ్జాయ్, షాజియా రంజాన్, కైనత్ రియాజ్ అనే ముగ్గురు అమ్మాయిలపై దాడి వెనుక తెహరీక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ కమాండర్ ముల్లా ఫజలుల్లా హస్తం ఉందన్న విషయాన్ని ఉగ్రవాదులు అంగీకరించినట్లు డీజీ ఆసిం బజ్వా తెలిపారు. మలాలాకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె స్కూలుకు వెళ్తుండగా ఓ ఉగ్రవాది ఆమెను తలలో కాల్చాడు. అమ్మాయిలు చదువుకోవాలని ప్రచారం చేస్తున్నందుకే ఆమెపై దాడి జరిగింది. గత సంవత్సరం ఆమెకు భారతీయుడు కైలాష్ సత్యార్థితో కలిసి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు.