ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: తన జల్సాలకు అడ్డుపడుతున్న భర్తను హత్య చేసిన భార్యకు జీవిత ఖైదు విధిస్తూ విజయవాడ ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డి.లక్ష్మీ శుక్రవారం తీర్పు చెప్పారు. 2016 నవంబర్ 23న కొత్తపేట (టూ టౌన్) పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఘటన అప్పట్లో నగర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన జమలమ్మకు జి.కొండూరు మండలం వెంకటాపురానికి చెందిన ఏడుకొండలు(32)కు 16 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్నాళ్లకు జమలమ్మ చెడు వ్యసనాలకు బానిసైంది.
వీటిపై ప్రశ్నిస్తున్న భర్త ఏడుకొండలును అడ్డు తొలగించుకోవాలనే నిర్ణయాన్ని తన చెల్లెలు లక్ష్మికి వివరించింది. అదే గ్రామంలో హత్య చేస్తే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో కాపురాన్ని టుటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పి.నైనవరం గ్రామానికి మార్చింది. అంబాపురంలో కొత్త ఇంట్లోకి ప్రవేశించిన రోజునే చెల్లెలు లక్ష్మి, న్యూఆర్‌ఆర్ పేటకు చెందిన ఒడియార్ గణేష్, జక్కంపూడికి చెందిన బాలసాని తిరుపతి సాయంతో జమలమ్మ తన భర్త ఏడుకొండలు మెడకు తాడు చుట్టి చంపేసిందని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు.
మూడు రోజుల తర్వాత ఆ గది నుంచి వస్తున్న దుర్వాసను పసిగట్టిన ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో జమలమ్మకు కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. మిగిలిన నిందితులపై నేరం రుజువు కాకపోవడంతో నిర్దోషులుగా విడుదలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment